టీఆర్ఎస్- వైసీపీ రహస్య స్నేహానికి సంబంధించి మరో దుమారం చెలరేగింది. వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం కోసం టీఆర్ఎస్ వాహనాలు వాడుతున్నారని నెల్లూరులో ప్రచారం జోరందుకుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వినియోగించిన ప్రచార రథాలు ఏపీలో దర్శనమిస్తున్నాయి. ఆ వాహనాలు వైసీపీ ప్రచార రథాలుగా మారుతున్నాయి. ప్రచారం కోసం వైసీపీ సిద్ధం చేసుకున్న జిప్సీలో సీటింగ్ కవర్లు టీఆర్ఎస్ సింబల్ తో ఉన్నాయి. గులాబీ సీట్లు..కారు సింబల్ ఉన్న ఈ వాహనం..నగరంలోని నిప్పో సెంటర్‌లో కనిపించటంతో స్థానికంగా ఆసక్తికరం అంశంగా మారింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ ఉపయోగించుకున్న వాహనాలనే..రీ స్టికరింగ్ చేసి వైసీపీ వాడుకుంటోందని తెలుగు తమ్ముళ్లు అరోపిస్తున్నారు.
వైసీపీ, టీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉంది అంటూ టీడీపీ చాన్నాళ్లుగా వాదిస్తోంది. ఏపీపై కుట్ర చేసేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటి అయ్యాయని ఏపీ సీఎంతో సహా టీడీపీ నేతలంతా ఆరోపిస్తున్నారు. గతంలో చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో టీఆర్ఎస్ గోడ గడియారాలను రీ స్టిక్కరింగ్ చేసి వైసీపీ పంచినట్లు సోషల్ మీడియాలో రచ్చ రాజుకుంది. ఇక ఇప్పుడు వైసీపీ పెయింటింగ్ ఉన్న ప్రచార వాహనంలో టీఆర్ఎస్ సింబల్ ఉండటంతో మరోసారి దుమారం మొదలైంది. నెల్లూరు జిల్లా వేదాయపాలెం పుట్టవీధిలోని ఓ మెకానిక్ షెడ్డులో టీఆర్‌ఎస్ వాహనాలకు వైసీపీ కలర్ వేస్తున్నారు. అక్కడికి బయటి వ్యక్తులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అక్కడ ఉన్నవారిని ప్రశ్నించగా తాము టీఆర్‌ఎస్ వాహనాలు కొనుగొలు చేశామని, వాటిని వైసీపీ పార్టీకి చెందిన నాయకులకు అమ్ముతున్నామని చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్‌కు సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారన్న ప్రచారానికి ఈ వాహనాలు బలాన్ని చేకూర్చుతున్నాయి.
కేసీఆర్ ఏపీ కోట్లు పంపిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు వచ్చాయని చెబుతున్నారని, కేసీఆర్ సంపాదించిన డబ్బులో ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారని విమర్శించారు. ఎందుకు పెట్టుబడి పడుతున్నారంటే ఆయనకు సామంత రాజ్యం కావాలని, దానికి ఒక పథకం ప్రకారం మనిషిని పెట్టుకున్నారని.. ఆ మనిషే జగన్మోహన్ రెడ్డని చంద్రబాబు అన్నారు. అతనిని ఎంపోర్ చేస్తూ డబ్బులు పంపిస్తున్నారని, ఇప్పటికే రూ. వెయ్యి కోట్లు పంపించారని.. ఇంకా ఎంత పంపిస్తారో తెలియదని అన్నారు. అదే కేసీఆర్ తనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని అన్నారు.