ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, నమస్కారములు. మీ విశాఖ పర్యటనకు సరిగ్గా ఒక్కరోజు ముందు మీ మంత్రిమండలి సహచరుడు, రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ప్రకటన మీరు ‘మసిపూసి చేసిన మారేడుకాయ’ మినహా దాని వల్ల మాకు ఒరిగే ప్రయోజనమే లేదు. రూ.6,500 కోట్ల కార్గో రాబడి గల కె.కె. లైనును రాయగఢ్‌లో చేర్చి ఆంధ్రప్రదేశ్‌కు మీరు మరో ద్రోహం చేస్తున్నారు. 1843 నుంచి ఉన్న వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయడం పుండు మీద కారం జల్లడం కాదా? స్థానిక డివిజన్ లేకుండా రైల్వే జోన్ ఏర్పాటుచేయడం భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు మాకు చేసిన అన్యాయాలపై మా ప్రజల నిరసన గళాన్ని మరోసారి వినిపిస్తున్నాను. మీ ప్రస్తుత పర్యటనలోనైనా ఈ క్రింది 18 అంశాలపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. 1) తేదీ.20.02.2014నాడు నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఎందుకు ప్రకటించరు? 2) పోలవరం ప్రాజెక్టు కోసం మేము ఖర్చు చేసిన రూ.4,063 కోట్ల బకాయిలను గత 8 నెలలుగా ఇవ్వకుండా నిలిపివేయడం, డీపీఆర్-2ను ఆమోదించకుండా తొక్కిపెట్టడం ఆంధ్రప్రదేశ్ పట్ల మీ కక్షసాధింపు ధోరణి కాదా? 3) ‘కాగ్’ నిర్దారించిన తొలి ఏడాది రెవిన్యూ లోటు రూ.16 వేల కోట్లను విడుదల చేయాల్సి ఉండగా, కేవలం రూ.3,979 కోట్లు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని నిరాకరించడం మీ నిరంకుశత్వం కాదా..? 4) ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మించి ఇస్తామని చెప్పి కొత్త రాజధాని నిర్మాణానికి తొలిదశలో రూ.40 వేల కోట్లు కావాలని కోరితే నాలుగేళ్లలో కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి సరిపెట్టడం మీ బాధ్యతారాహిత్యం కాదా?
5) కె.బి.కె. తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తామని చట్టంలో ఉన్నప్పటికీ, ఈ మూడేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు ఇచ్చి, నాలుగో ఏడాది మా ఖాతాలో జమ చేసిన రూ.350 కోట్ల నిధులను మా అనుమతి లేకుండా వెనక్కి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా? 6) కావాల్సినంత ఖనిజ వనరులు, భూమి, నీటి వసతి, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రం ముందుకు వచ్చినా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకపోవడం రాష్ట్రం పట్ల వివక్ష కాదా? 7) రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలకు మేము రూ.11,600 కోట్ల విలువ చేసే 2,909 ఎకరాల భూమిని ఇస్తే, మీరు ఇవ్వాల్సిన రూ.12,746 కోట్లకు గాను కేవలం రూ.746 కోట్లు ఇస్తే, ఆ సంస్థల నిర్మాణానికి ఎన్ని దశాబ్దాల కాలం పడుతుందో తెలుసా? 8) నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నం పోర్ట్ నిర్మాణం తొలిదశ 2018 కల్లా పూర్తిచేయాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నా, మీరు కుంటిసాకులతో చేపట్టకపోవడం రాష్ట్రం పట్ల మీ నిర్లక్ష్యం కాదా? 9) ఢిల్లీ-ముంబై ఇండస్ర్టియల్ కారిడార్ అభివృద్ధికి రూ.17,500 కోట్లు ఇచ్చి పెద్దమనసు చాటుకున్న మీరు మా రాష్ట్ర పరిధిలోని విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ (VCIC)కు కేవలం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోమనడం మా రాష్ట్రం పట్ల చిన్నచూపు కాదా? 10) అసలే రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు అయ్యే వయబులిటీ గ్యాప్ ఫండింగ్‌ను 15 ఏళ్ల పాటు భరించమనడం భావ్యమేనా? 12) లోపభూయిష్టమైన విభజన చట్టం వల్ల ఏపీకి రూ.3,820 కోట్ల నష్టం వాటిల్లితే, మీరు ఆ నష్టాన్ని పూరించేందుకు తీసుకున్న చర్యలేవి? 13) విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు 2016లోనే పంపిస్తే బెంగళూరు, భూపాల్, ఇండోర్ మెట్రో రైళ్లు, ముంబై సబర్బన్ రైళ్లకు వేల కోట్ల నిధులిచ్చిన మీరు మాకు మాత్రం మొండిచెయ్యి చూపించడం ధర్మమా? 14) కొత్త రాజధాని అమరావతికి ర్యాపిడ్ రైల్ నెట్వర్క్, రోడ్ కనెక్టివిటీకి కొర్రీల మీద కొర్రీలు వేస్తూ పెండింగ్‌లో పెట్టడం వేధింపులు కావా?
15) విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల విస్తరణకు వందల ఎకరాల భూములు మేమిచ్చినా పూర్తిస్థాయిలో విస్తరణ చేపట్టకుండా, అంతర్జాతీయ సర్వీసులు రాకుండా అడ్డుపడటం మా అభివృద్ధికి ఆటంకం కాదా? 16) 175 శాసనసభ స్థానాలను 225 స్థానాలకు పెంచాలని చట్టం సుస్షష్టంగా పేర్కొన్నా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవటం రాజకీయ కుట్ర కాదా? 17) గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికీ కేంద్ర హోం శాఖ ఏ చర్యలూ తీసుకోకపోవడం అన్యాయం కాదా? 18) షెడ్యూల్ 9, 10 కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంస్థల విభజనకు తెలంగాణా సహకరించనప్పుడు, మీరు చొరవ తీసుకోకపోగా, సుప్రీం కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా మీరు ఆస్తులు, అప్పుల పంపిణీలో అన్యాయం జరిగేలా ఆదేశాలు జారీచేయడం దుర్మార్గం కాదా? పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, పార్లమెంటు చేసిన పునర్విభజన చట్టంలోని అంశాలను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేసి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచి ఇప్పుడు మీరు రిక్తహస్తాలతో మా రాష్ట్రానికి రావడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా? పైన తెలిపిన అంశాలన్నింటి అమలుకు మీరు మీ విశాఖపట్నం సందర్శన సందర్భంగా ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాను. లేని పక్షంలో ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఈ గడ్డపై కాలుమోపడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తారు. ఇట్లు భవదీయుడు (నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)