ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు... ఎన్నికల తేదీలు ఎప్పుడో తెలీదు! కానీ... ఇప్పుడే ప్రచార భేరీ మోగింది. తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆ వెంటనే వారు ప్రచార బరిలోకి దిగుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి షబానా అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో... ఆదివారం ఆమె నగరంలో ప్రచారాన్ని ప్రారంభించేశారు. జిల్లా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఈ ప్రచార ప్రారంభ కార్యక్రమానికి హాజరై ఆమె అభ్యర్థిత్వానికి అధికార ముద్ర వేసేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మోగిన ప్రచార భేరీకి ఇదొక ఉదాహరణ! అలాగే అనేక మంది అభ్యర్థులు ప్రజల్లోకి వెళుతున్నారు.
గతానికి భిన్నంగా... టీడీపీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు సుదీర్ఘంగా జరుగుతుంది. ఇతర పార్టీల అభ్యర్థులు, సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు వంటివన్నీ బేరీజు వేసుకొని ఆచితూచి అభ్యర్థులను ఖరారు చేస్తుంటారు. నామినేషన్ల దాఖలు మొదలైన తర్వాతే అభ్యర్థుల జాబితాలు వెలువడడం ఆ పార్టీలో ఆనవాయితీ. కానీ, ఈసారి అందుకు భిన్నంగా పార్టీ అధినేత చంద్రబాబు బాగా ముందే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఆయన వేగం చూసి ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఏ వివాదాలూ లేకుండా అంతా బాగానే ఉందనుకొన్న వారికి పార్టీ అంతర్గత సమావేశాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. మీడియాకు సమాచారం కూడా అందిస్తున్నారు. ఉదాహరణకు కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో పది సీట్లకు అభ్యర్థులను ఆయన ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ముందే ఖరారు చేయడం ఆ పార్టీలో ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ను విరమింపచేసి ఆయన కుమార్తెకు ఆ సీటిచ్చారు.
ప్రవాసాంధ్రురాలైన ఆమె రాజకీయాల్లో చేరేందుకు ఇక్కడకు తిరిగి వచ్చేశారు. నందిగామకు తిరిగి టికెట్ పొందిన సిటింగ్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. విజయవాడ నగర ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా మహేశ్వరరావు చాలా రోజుల నుంచే విస్తృతంగా తిరుగుతున్నారు. ఇప్పుడు వారి తరఫున ప్రచార బృందాలు రంగంలోకి దిగాయి. పెనమలూరు, గన్నవరం ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వల్లభనేని వంశీ కూడా ప్రచారం మొదలుపెట్టేశారు. కడప జిల్లాలో రాయచోటి అభ్యర్థి రమేశ్ కుమార్ రెడ్డి, రాజంపేట అభ్యర్థి చెంగల్రాయుడు కూడా ప్రచారం ప్రారంభించారు. మైదుకూరు అభ్యర్థిగా ఖరారైన టీటీడీ చైర్మన్ సుధాకర్ యాదవ్ మంచి ముహూర్తం చూసుకొని రెండు మూడు రోజుల్లో ప్రచారం మొదలు పెట్టబోతున్నారు.