పుంగనూరు తెలుగుదేశం అభ్యర్థిగా నూతనకాల్వ అనీషారెడ్డి పేరును తొలిజాబితాలోనే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు. గురువారం విజయవాడలో జరిగిన టీడీపీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆమె పేరును ఖరారు చేశారు. పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా గత రెండు పర్యాయాలు పోటీ చేసిన ఎం.వెంకటరమణరాజు ఓటమి చెందడంతో 2019 ఎన్నికలకు కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ అధిష్ఠాన వర్గం కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి ద్వితీయ కుమారుడు పుంగనూరు టీడీపీ సమన్వయకర్త ఎన్.శ్రీనాథరెడ్డి సతీమణి ఎన్.అనీషారెడ్డిని ఎన్నికల్లో నిలపాలని భావించింది.
గత ఏడాది సెప్టెంబరు నుంచి అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. కడప జిల్లా రాయచోటి మండలం బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు రఘురామరెడ్డి కుమార్తె అయిన అనీషారెడ్డికి తొలినుంచీ రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు. గత మూడు పర్యాయాలుగా పార్టీ టికెట్ కోసం రేసులో ఉన్నారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి మరదలు అనీషారెడ్డి గెలుపుకోసం పలుమార్లు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి గ్రామసభల్లో వైసీపీ నాయకులు ప్రోటోకాల్ పేరుతో వేదికమీదకు అనీషారెడ్డిని రాకుండా అడ్డుకున్నా ప్రజలే మాకు ప్రోటోకాల్ అంటూ వేదికల వద్ద నేలపై కూర్చుని ప్రసంగించడం ద్వారా అందరినీ ఆకట్టుకోగలిగారు. దీంతో ప్రజల్లోనే కాక, అధిష్టానం వద్ద కూడా మన్ననలు పొందారు.
పార్టీ క్యాడర్‌కు అవసరమైన సమయాల్లో అండగా ఉంటున్నారు. ఇటీవల సదుం, సోమల మండలాల్లో జరిగిన గొడవల్లో టీడీపీ శ్రేణులకు తామున్నామంటూ ధైర్యం చెప్పి బాధితులను ఓదార్చారు. పుంగనూరు ప్రాంతానికి హంద్రీనీవా కాల్వ ద్వారా కృష్ణాజలాలు రావడం, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, పసుపు, కుంకుమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలుగుదేశం పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా అనీషారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీని గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిశ్చయించుకున్నారని చెప్పారు. పుంగనూరు ప్రజలు, టీడీపీ కుటుంబ సభ్యులు, నూతనకాల్వ కుటుంబ అభిమానులు సహకారంతో తాను విజయం సాధిస్తానన్నారు.