సినీ నటుడు నాగార్జున వైసీపీ అధినేత జగన్‌తో భేటీ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున వైసీపీలో చేరనున్నారని కొందరు, నాగార్జునకు గుంటూరు ఎంపీ టికెట్ ఖాయమైందని మరికొందరు, నాగార్జున తనకు కావాల్సిన వ్యక్తి కోసం జగన్‌ను కలిశారని ఇంకొందరు.. ఇలా మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు టెలీకాన్ఫరెన్స్‌లో ఇదే అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జున భేటీ కావడం సరైంది కాదని పలువురు టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా రాజకీయ వర్గాల్లో నాగార్జున, జగన్ భేటీ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ హైదరాబాద్ కేంద్రంగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కోసమే కేంద్రస్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు వివరించారు. రాష్ట్రాల్లో ఎవరి బలాల మేరకు వాళ్లు పోటీ చేస్తారని చెప్పారు. ఏపీకి ద్రోహం చేసి నేటికి ఐదేళ్లు అని... నమ్మకద్రోహాన్ని నిరసిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని నేతలను ఆదేశించారు. ప్రత్యేక హోదా సహా మిగిలిన ఐదు హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఆర్ధికలోటులో నాలుగో వంతు కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాత్ర చేస్తోందని, రాష్ట్రంలో ఆ పార్టీ విషయంలో మనం స్పష్టతతో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశ ప్రయోజనాల కోసం మాత్రమే కేంద్ర స్థాయిలో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాక్ స్పష్టం చేసిందన్నారు. ఈ విషయంలో రాజకీయ లబ్ధి దాగి ఉందా? అనే అనుమానం దేశవ్యాప్తంగా బలపడుతోందని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే భాజపా రిమోట్ కంట్రోల్లో ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా నేతల్లో చాలా వరకూ గొడవలు లేకుండా ఎవరి పరిధిలో వారు పని చేసుకుంటున్నారని కితాబిచ్చారు. పేదల సంక్షేమానికి అందరూ కలిసి రావాలని సీఎం పిలుపునిచ్చారు. పనిచేసే వారికే ప్రజా దీవెనలు ఇవ్వాలన్నారు. ఫిబ్రవరి 20... సరిగ్గా ఈ రోజుకు ఏపీకి ద్రోహం చేసి 5 ఏళ్లు అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. నమ్మక ద్రోహానికి ఐదో వార్షికానికి నిరసనలు జరపాలని సూచించారు. 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసి 5 ఏళ్లు అయ్యిందని, ప్రత్యేక హాదాతో సహా మిగిలిన 5 హామీలు గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీ ఇవ్వలేదని, వెనుకబడిన జిల్లాలకిచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని ఆక్షేపించారు. భాజపా నమ్మక ద్రోహాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు. జాతీయస్థాయిలో భాజపాయేతర పార్టీలతో కలిసి పనిచేస్తామని మరోమారు స్పష్టం చేశారు.