గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వైసీపీలో చేరనున్నారనే ప్రచారం మంగళవారం రాజకీయవర్గాల్లో నెలకొంది. టీడీపీలో తిరిగి తనకు టిక్కెట్ లభించదనే సంకేతాలతో ఆయన వైసీపీలో బెర్త్ కోసం పావులు కదుపుతున్నారని ప్రచారం గత కొంతకాలంగా ఉంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంపై మోదుగుల కన్నేశారని, అక్కడ గెలుపు అవకాశాలపై ఇటీవల సర్వే కూడా చేయించుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో మంగళవారం వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యేందుకు కూడా సిద్ధమయ్యారని తెలిసింది. హైదరాబాద్ వెళ్ళి జగన్‌ను కలిశారని.. పార్టీలో కూడా చేరారని ఒక దశలో ప్రసార సాధనాల్లో కథనాలు వచ్చాయి.
అయితే పలానా సీటు కావాలని మోదుగుల షరతు విధించిన నేపథ్యంలో భేటీ వాయిదా పడినట్లు సమాచారం. తాను లండన్ వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత మాట్లాడదామని జగన్ దాట వేసినట్లు తెలిసింది. సీటు విషయంలో లభించని హామీతో వైసీపీలో చేరిక వాయిదా పడినట్లు సమాచారం. మోదుగుల సత్తెనపల్లి సీటును అడిగేందుకు జగన్ వద్దకు వెళుతున్నట్టు వచ్చిన ప్రచారం నేపథ్యంలో అంబటి రాంబాబు, జిల్లాకు చెందిన ఓ కీలక యువనేతతో కలిసి హుటాహుటీన హైదరాబాద్ వెళ్ళారు. ముందుగా పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కలిసి మోదుగులకు సత్తెనపల్లి సీటు ఇవ్వటంపై చర్చించినట్లు తెలిసింది. తొలి నుంచి పార్టీని నమ్ముకొని ఎన్నో వ్యయప్రయాసలు తట్టుకొని పనిచేస్తున్న వారిని హఠాత్తుగా తప్పించి పార్టీలో కొత్తగా చేరేవారికి సీటు ఇవ్వటం తగదని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటి వరకు టీడీపీలో ఉంటూ జగన్‌పై, వైసీపీపై విమర్శలు చేసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటమే తప్పని, పైగా అతను కోరిన టిక్కెట్టు ఇచ్చేందుకు సన్నద్ధమవటం ఎంత వరకు సబబని బొత్సను ప్రశ్నించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకొని ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేద్దామని కలలు కన్న నేతలను వెన్నుపోటు పొడిచారనే భావన పార్టీ కేడర్‌లో ఉందని బొత్సకు వివరించినట్లు సమాచారం. ఇప్పటికే జంగా కృష్ణమూర్తి(గురజాల), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు పశ్చిమ), మర్రి రాజశేఖర్ (చిలకలూరిపేట), కత్తెర క్రిస్టియానా (తాడికొండ), కావటి మనోహర్‌నాయుడు (పెదకూరపాడు)లకు అన్యాయం జరిగిందనే భావన నెలకొని ఉందని, ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికీ అసమ్మతి జ్వాలలు ఆరలేదని బొత్సకు వివరించినట్లు తెలిసింది.