తెలుగుదేశాన్ని వీడి వైసీపీలో చేరిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెంట ఇద్దరు చోటా నేతలు మాత్రమే నడిచారు. వారిలో ఒకరు దేవరాపల్లి ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు కాగా మరొకరు అనకాపల్లి మాజీ కౌన్సిలర్ తాడి రామకృష్ణ. ఐదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తి పార్టీ మారితే, పట్టుమని పది మంది కూడా ఆయన వెంట నడవకపోడాన్నిబట్టి చూస్తే ముత్తంశెట్టికి ప్రజా బలం ఏ మాత్రం వుందో అర్థం చేసుకోవచ్చని నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. ముత్తంశెట్టి వెళ్లిపోతే టీడీపీకి ఎటువంటి నష్టం లేదని, అంతిమంగా ఆయన నష్టపోయి పశ్చాతాపం చెందుతారని వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు గతంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నప్పుడు అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వేలాది మంది కార్యకర్తలు టీడీపీని వీడొద్దని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ ఆయన పట్టించుకోకుండా వైసీపీలో చేరారు. తరువాత అక్కడ ఇమడలేక బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. కానీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరుతుంటే.... వద్దని ప్రాధేయపడేవారు ఒక్కరు కూడా కనిపించలేదు. అనకాపల్లి బైపాస్ రోడ్డులోని ఎంపీ కార్యాలయానికి గురువారం ఎవరూ రాలేదు.
దేవరాపల్లి ఎంపీపీ కిలపర్తి వైసీపీలో చేరిక... తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు గురువారం ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైసీపీలో చేరారు. ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కిలపర్తి భాస్కరరావు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడడంతో రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్ల ఎంపీటీసీ సభ్యునిగా గెలిచి, ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే కొద్ది రోజుల నుంచి టీడీపీకి దూరంగా వుంటున్నారు. ఇప్పుడు ఎంపీ ముత్తంశెట్టితో కలిసి వైసీపీలో చేరారు.