టీడీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు శుక్రవారం ఓటాన్ అకౌంట్‌పై చర్చకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఏపీని తిరుగులేని శక్తిగా చేస్తామని, తమను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఐదేళ్లుగా ప్రధాని మోదీ దేశానికి ఏం చేశారో చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, దేశానికి ఏం చేద్దామన్న ఆలోచన కూడా మోదీకి లేదని, దీని వల్ల దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. రైతులు పండించిన పంటను కొనకుండా, వారి కష్టాలను పట్టించుకోని మోదీ ప్రభుత్వం రాటుదేలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎదురుదాడికి పాల్పడుతున్న మోదీ సర్కార్ చాలా ఘోరంగా వ్యవహరిస్తోందని, నాయకత్వాన్ని చంపేస్తున్నారని, ఇది దేశానికి పెద్ద శాపం అని విరుచుకుపడ్డారు.
రాజకీయనాయకులపై బురద జల్లాలని, కార్పొరేట్ సెక్టర్ ని, మీడియాని కిల్ చేయాలని చూస్తున్నారని.. ఆయనొక్కడే ఉండాలని ప్రధాని మోదీ చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరూ కలిసిన మరుసటి రోజు ఈ ప్రధాన మంత్రి ఏమవుతారో ఆలోచించుకోండంటూ ఏపీ బీజేపీ నేతలను హెచ్చరించారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు సాక్షాత్తు ప్రధాన మంత్రే అక్కడి ఎమ్మెల్యేలకు డబ్బులు పంపించి బేరసారాలు చేస్తున్నారని, ఇది ఎంత వరకు కరెక్టు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులందరూ లేచి చప్పట్లతో అభినందించారు. విజన్ 2024 ఇచ్చామని, చాలా ఆలోచనలు చేశామని, ఇంకా ఏమైనా ఉంటే సూచనలు చేయాలని సీఎం పిలుపు ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని నెరవేరుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుదని చంద్రబాబు స్పష్టం చేశారు. మళ్లీ రాబోయే రోజుల్లో ప్రభుత్వపరంగ ఏం చేయబోతున్నామో విజన్ 1924 ఇచ్చామన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా తయారు చేసి ప్రజల ఆశీర్వాదం కోసం వెళతామని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు పట్టం కట్టాలని పవిత్రమైన శాసనసభ నుంచి ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు అన్నారు.