రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి మరో పారిశ్రామిక దిగ్గజం ముందుకొచ్చింది. ఉక్కు, ఇంధన, సిమెంట్, మౌలిక సదుపాయాలు, క్రీడా రంగాల్లో ప్రపంచ ప్రఖ్యాత జిందాల్ గ్రూపు రూ.3,500 కోట్లతో ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టులో రెండు జెట్టీల అభివృద్ధి, పైపులైన్ ప్రాజెక్టులు చేపట్టేందుకు దావోస్ వేదికగా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ ఆర్థిక వేదికలో ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేశ్ సమక్షంలో జిందాల్ గ్రూపు జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్ సజ్జస్ జిందాల్...రాష్ట్ర మౌలిక సదుపాయాల (పోర్టులు)శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ), మారిటైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నారు. రామాయపట్నం పోర్టులో స్టాక్ యార్డు, పోర్టు కార్యకలాపాలకు సంబంధించి సుమారు 200 ఎకరాల్లో రూ.1,000 కోట్లతో రెండు జెట్టీలు నిర్మిస్తారు. మరో రూ.2,500 కోట్లతో పైపులైను ఏర్పాటు చేస్తారు.
ఈ రెండు ప్రాజెక్టులతో 40 మందికి ప్రత్యక్షంగా, మరో 175 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రామాయపట్నం పోర్టు దగ్గర ఉక్కు పరిశ్రమ, రాష్ట్రంలో విద్యుత్తు వాహనాల పరిశ్రమ, అపెరల్ పార్కు ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నామని ఈ సందర్భంగా సజ్జస్ జిందాల్ మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు. తమ బృందం ఇప్పటికే అనేకసార్లు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించిందని, అభివృద్ధిని స్వయంగా చూడాలని అనుకుంటున్నామని ఆయన అన్నారు. సాంకేతికతను సంపూర్ణంగా వినియోగించుకునే నేతగా చంద్రబాబు దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. విమానాశ్రయాలు, ఓడరేవులు అభివృద్ధి చేస్తున్నామని, మరిన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు.
ఒప్పంద పత్రాలపై ఈడీబీ తరఫున సీఈవో జాస్తి కృష్ణకిశోర్, పోర్టుల సంచాలకులు డాక్టర్ కె.ప్రవీణ్, జేఎస్‌డబ్ల్యూ నుంచి సంస్థ జేఎండీ, సీఈవో బీవీజీకే శర్మ సంతకాలు చేశారు. సమావేశంలో మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరక్టర్ అహ్మద్ బాబు, సమాచారశాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు పాల్గొన్నారు. విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొని అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ లాంజ్‌లో ‘రేపటి కోసం సాంకేతికం’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన సమావేశంలో లోకేశ్ అన్నారు. 15 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రపంచ ఆర్థికవేదిక కాంగ్రెస్ సెంటర్లో మేకింగ్ డిజిటల్ గవర్నెన్స్ వర్క్, భారత్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవం, అందరికీ సాంకేతికత అనేఅంశాలపై జరిగిన చర్చల్లోనూ లోకేశ్ మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవంతో ఉద్యోగాలు పోతాయనేది అపోహ మాత్రమేనన్నారు.