కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే. తాము మూడు గిఫ్ట్‌లు ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తామేమీ చేతకానివారం కాదని అన్నారు. మనతో ప్రధాని మోదీ మంచిగా ఉన్నంతవరకు కేసీఆర్ కూడా మంచిగానే ఉన్నారని అన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావడంతో కేసీఆర్ కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏకు ఎలా అప్పగిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తనకు గిఫ్ట్ ఇవ్వడానికి వాళ్ల తమ్ముడు, అవినీతిపరుడు.. జగన్మోహన్ రెడ్డి.. కోడికత్తిపార్టీని పెట్టుకున్నాడని, కేసీఆర్, జగన్ కలిసినా తనను ఏమీ చేయలేరన్నారు.
అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనలో పోటీ పడలేదని అన్నారు. అక్కడ తెలంగాణలో సెంటిమెంట్ మాట్లాడుతూ..ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. ఒకవైపు సీనియర్ మోదీ, ఇంకొపక్క తెలంగాణ మోదీ, మరోవైపు కోడికత్తి మోదీ ఉన్నారని... ఈ ముగ్గురు కలిసి ఏపీపై పడ్డారని, రాష్ట్రం అభివృద్ధిచెందకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కేంద్రసహాయనిరాకరణ చేశారని, అయినా తాము ముందుకుపోతున్నామని, అది మోదీకి మింగుడుపడడంలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతు రుణమాఫి తెలంగాణలో రూ. లక్ష ఇస్తే, ఏపీలో రూ. లక్షా 50వేలు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం ఇచ్చామని, అన్నా క్యాంటీన్లు పెట్టామని.. ఇలా ఏపీలో చేసిన అభివృద్ది, సంక్షేమకార్యక్రమాలను చంద్రబాబు వెల్లడించారు.
అభివృద్ధిలో పోటీపడలేక ఏపీపై దాడులు చేయడానికి వస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కేసీఆర్ కు అవినీతి తమ్ముడు జగన్ తోడయ్యాడన్నారు. కేసీఆర్, జగన్ లు కలిసినా ఆంధ్రప్రదేశ్ ను ఏమీ చేయలేరన్నారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈడీ దాడులా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే వరకు కేంద్రాన్ని వదిలేది లేదన్నారు. విభజన జరిగినప్పుడు అందరూ భయపడ్డారని, విభజనతో దగా పడ్డాం.. నష్టపోయామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అండగా ఉంటారని ఎన్డీఏలో భాగస్వాములయ్యామని, న్యాయం చేస్తారని నమ్మితే ఎన్డీఏ నమ్మక ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు.