ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ సైన్సు ప్రయోగశాల సేవలు మంగళవారం నుంచి అమరావతి కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న ఈ సంస్థ సిబ్బంది విభజన ఇటీవల పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 117 పోస్టులను కేటాయించగా...అందులో 72 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం 45 మంది సిబ్బందితోనే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. త్వరలో మరో 30 మందిని పొరుగు సేవల ప్రాతిపదికన నియమించుకోనున్నారు. మంగళగిరి ఏపీ పోలీసు పటాలంలోని సాంకేతిక సౌధం భవనంలో ఈ ప్రయోగశాల కోసం తాత్కాలికంగా రెండంతస్తుల్లో 25 వేల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతాన్ని కేటాయించారు.
రాజధాని నగరంలో నిర్మిస్తున్న శాశ్వత భవనం నిర్మాణం పూర్తయ్యేంత వరకూ సాంకేతిక సౌధంలోనే రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల నడవనుంది. దీనికి సంబంధించి కావాల్సిన అన్ని రకాల పరికరాలను ఇప్పటికే కొనుగోలు చేశామని ఏపీ ప్రభుత్వ ఫోరెన్సిక్ సలహాదారు డా.కేపీసీ గాంధీ తెలిపారు. దాదాపు రూ.30 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలతో ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలకు ఏపీకి సంబంధించి సంవత్సరానికి సగటున 15 వేల కేసులకు చెందిన నమూనాలు వెళ్తున్నాయి. ఇప్పటివరకూ వీటిని ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లడం ప్రయాసగా ఉండేది. ఎంతో సమయం కూడా వృథా అయ్యేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు.