తాజాగా వెలువడిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజల్లో పార్టీల ప్రభావం, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లభించే స్థానాలపై ఊహాగానాలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు భాజపా నుంచి కాంగ్రెస్ చేతికి వెళ్లిపోయాయి. ఇటు తెలంగాణలో తెరాస జెండా ఎగరగా, మరో రాష్ట్రమైన మిజోరంలో ప్రాంతీయ పార్టీ ఎంఎన్ఎఫ్కు ప్రజలు పట్టం కట్టారు. మొత్తంగా అయిదు రాష్ట్రాల్లోనూ భాజపా ప్రభావం ఏమీ లేదు. అయితే ఈ ఫలితాలను బట్టి చూస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించింది. అయితే ట్రెండ్ ఇలాగే కొనసాగితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆ సంఖ్య సగానికి సగం తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2014లో ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 65 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా భాజపాకు 62స్థానాలు దక్కాయి. కానీ వచ్చే ఎన్నికల్లో ఆ సంఖ్య 30కి తగ్గనుందని విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభావం బాగా పెరిగినందున ఆ పార్టీకి సీట్ల సంఖ్య పెరగనుందని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అటు ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, ఇతర భాజపా ముఖ్యమంత్రులు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించకపోవడం గమనార్హం.
రాజస్థాన్‌లో గతంలో 25కు 25సీట్లు భాజపాకే దక్కగా, ఈసారి 13 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో 29ఎంపీ స్థానాలు ఉండగా, గతంలో భాజపా 27చోట్ల గెలిచింది. ఛత్తీస్‌గఢ్‌లో 11 ఉండగా పదింటిలో విజయం సాధించింది. 65లో మిగిలిన మూడు స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి. అయితే ఈసారి ఇందులో చాలా సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోగా కమలదళం పుంజుకోకపోతే ఎంతో ముఖ్యమైన మూడు రాష్ట్రాల్లో చాలా నష్టపోవాల్సి వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.