ప్రధాని నరేంద్రమోదీ జనవరి 6న గుంటూరుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకు నిరసనగా, దాదపుగా 15-20కిమీ మేర పాదయాత్ర చేసి, అదే రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోడీ రాష్ట్రానికి చేసిన మోసం, నమ్మక ద్రోహం, చేస్తున్న కుట్రలుకు వ్యతిరేకంగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మోడీ వచ్చే జనవరి 6న కూడా, నిరసన తెలపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలనే దిశగా సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయం, ద్రోహంపై నూతన సంవత్సరం తొలి రోజున భారీస్థాయిలో నిరసనలు తెలపాలని అనుకున్నా, ప్రజలు నూతన సంవత్సర ఉత్సాహంలో ఉంటారు కాబట్టి, ముందు రోజు కాని, జవనరి రెండున కాని నిరసనలు తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.
తనతో సహా అందరూ ఆ రోజు నల్లబ్యాడ్జి తగిలించుకుని నిరసన తెలిపితే రాష్ట్ర కష్టాలు తెలుస్తాయని భావిస్తున్నారు. అమరావతి నుంచి గ్రామస్థాయి వరకు ప్రజలంతా నిరసనలో పాల్గొంటే కేంద్రమే దిగివస్తుందని పేరొన్నారు. ఇక మరో నిరసనగా, మోదీ పర్యటనకు గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్న ఆయన, అదే పెద్ద నిరసనని వ్యాఖ్యానించారు. మోడీకి ప్రధాని హోదాలో, ప్రోటోకాల్ ప్రకారం సియంగా స్వాగతం పలకాల్సి ఉండగా, దానికి వెళ్ళకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, గుంటూరులో మోదీ సభకు తెలుగు ప్రజలు ఎవరూ హాజరు కారాదని అన్నారు.
ప్రధాని గుంటూరు పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంటుందని వ్యాఖ్యానించిన ఆయన, అది పార్టీ కార్యక్రమమేనని చెప్పారు. మోడీ పార్టీ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి, దానికి ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. దీని పై గత రెండు రోజులగా పార్టీ పెద్దలతో, అధికారులతో కూడా చర్చించి, తగు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ మోదీ సభకు వెళ్లకుంటే, అది ఓ పెద్ద గుణపాఠం అవుతుందని, ప్రజల సెంటిమెంట్ ఎలా ఉందన్న విషయం మోదీకి స్పష్టమవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే డిసెంబర్ 31న కాని, జనవరి 2న బీజేపీకి వ్యతిరేకంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో శాంతియుత నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు సూచించారు. దీని పై త్వరలోనే నిర్ణయం తీసుకుందామని చెప్పారు.