ఇదేదో ఆంధ్రజ్యోతి, ఈనాడు రాసింది అని, వాటి మీద బురద చల్లి వెళ్ళిపోవటానికి లేదు. పవన్ అనుకూల మీడియాలో వచ్చిన వార్తా కాబట్టి నమ్మాల్సిందే. వైసీపీ, జనసేన మధ్య రహస్య చర్చలు జరిగాయనే కధనాలు, పవన్ అనుకూల మీడియాలో వచ్చాయి. చంద్రబాబుని ఓడించటమే లక్ష్యంగా, ఇరు పార్టీల మధ్య పొత్తు కుదుర్చించేందుకు జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, వైసీపీ తరపున ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి చర్చలు జరిపారని వార్తలు నిన్నటి నుంచి గుప్ప మన్నాయి. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లుగా అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఏకంగా పవన్ అనుకూల మీడియాలో ఈ వార్తలు వచ్చాయి.
నిన్న నాగబాబు, విజయసాయిరెడ్డి మధ్య హైదరాబాద్లోని ఓ రిటైర్డ్ అధికారి నివాసంలో ఈ ఇరువురు చర్చలు జరిపారని సమాచారం. మూడు గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో జనసేనకు 15 నుంచి 25 అసెంబ్లీ సీట్లు, 4 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు వైసీపీ సూత్రప్రాయంగా అంగీకరించిందనే వాదన వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఇరు పక్షాలకు చెందిన నేతలు గోప్యంగా ఉంచుతున్నారు. ఇరు పార్టీలు ఈ విషయం మాత్రం దృవీకరించలేదు. అయితే ఈ భేటీ కేసీఆర్ సూచన మేరకే జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ అమెరికా నుంచి రాగానే కేసీఆర్ తో భేటీ కానున్నారని, జనసేన వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఏపి రాజకీయాల్లో వేలు పెడతా అని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో, కేసీఆర్ సూచనలను పవన్ కళ్యాణ్ తీసుకుని, ఏపిలో రాజకీయం చేయ్యనున్నారు. ఇక ఇప్పటికీ వైసీపీ, జనసేన నాయకుల మధ్య విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, వారి మధ్య రాజకీయ సఖ్యత కుదురుతుందా లేదా అన్నది సందేహంగానే ఉన్న సమయంలో, కేసీఆర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. రాజకీయ అవసరాల కోసం పార్టీలు వెనక్కి తగ్గడం సర్వసాధారణం కావడంతో, వైసీపీ, జనసేన కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వైసీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే, ఏపీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ స్కెచ్ అంతా నడిపిస్తున్న మోడీ, అమిత్ షాలు ముందు ముందు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తారో చూడాల్సి ఉంది.