ఒంగోలులో టిడిపి నేతలను తమ వైపు లాగే కార్యక్రమాన్ని వైసీపీ ప్రారంభించింది. తెలంగాణ ఎన్నికల ముగిసిన అనంతరం దూకుడు పెంచింది. రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ద్వారా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను రాబట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆయన ప్రమేయంతో ఇప్పటికే ఒకరిద్దరు నాయకులు వైసీపీలో చేరగా, మరో ఇద్దరు, ముగ్గురు నేతలతో ప్రస్తుతం ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి కదలికలపై టీడీపీ అధిష్ఠానం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు నాయకుల పార్టీ ఫిరాయింపులకు అవకాశం ఏర్పడింది. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో స్థానికంగా ఆ పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. తదనుగుణంగా పార్టీలోకి దీటైన అభ్యర్థులను చేర్చుకునే చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా టీడీపీతో పాటు, ఇతర ఏపార్టీలో కానీ, స్వతంత్రంగా కానీ ఉన్న బలమైన నేతల కోసం అన్వేషిస్తోంది. తొలుత ఆ బాధ్యతను జిల్లాతో సంబంధం ఉండి, వైసీపీలో కీలక నేతలుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, వై.వి. సుబ్బారెడ్డిలతోపాటు, పార్టీ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించింది. అదే తరహాలో రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వ్యవహారాలను రాజ్యసభ సభ్యుడు, జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చూస్తున్నారు. ప్రముఖ ఆడిటర్ కూడా అయిన ఆయనకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు, మన జిల్లాలోని కొందరి నాయకులతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. దీనికితోడు జిల్లాతో సంబంధం ఉన్న పార్టీ నాయకులకు వ్యక్తిగత రాగధ్వేషాలు ఉండొచ్చన భావనతో ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమ బాధ్యతను అధిష్ఠానం విజయసాయిరెడ్డికి అప్పగించినట్లు తెలిసింది.
ఇప్పటి వరకూ జిల్లాలో ఒకరిద్దరు ప్రాధాన్యత కలిగిన నాయకుల వైసీలో చేరికలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి వైసీపీలోకి చేరికకు ముగింపు ఇచ్చింది ఆయనే. విజయసాయిరెడ్డి రంగంలోకి దిగిన తర్వాతనే మహీధర్‌రెడ్డి వైసీపీలోకి చేరికకు మార్గం సుగమమైందన్న భావన జగన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ.. వైసీపీ చేస్తున్న ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ విషయంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా దృష్టి సారించి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియజేయాలని కొందరికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. ఈ ఆపరేషన్ వ్యవహారాలకు అనుగుణంగా టీడీపీ కూడా ఓ వ్యూహాన్ని రూపొందించుకొంటున్నట్లు తెలుస్తోంది.