‘‘విదేశాల్లో మూల్గుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం..’’ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఈ హామీపై ప్రతిపక్షాలు ప్రధాని మోదీ, బీజేపీలను తరచూ నిలదీస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే ప్రధాని హామీకి పూర్తి భిన్నంగా స్పందించి పప్పులో కాలేశారు. మహారాష్ట్రలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు’’ ఒకేసారి రావనీ.. కొద్దికొద్దిగా వస్తాయని పేర్కొన్నారు. ‘‘15 లక్షల రూపాయలు ఒకేసారి రావు, నెమ్మదిగా వస్తాయి. ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు. ఆర్బీఐని డబ్బులు అడిగినా వాళ్లు ఇవ్వడం లేదు. అందువల్ల డబ్బులు సమీకరించడం కుదరదు. హామీ అయితే ఇచ్చాంగానీ దానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి...’’ అంటూ చెప్పుకొచ్చారు.
2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... విదేశీ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున నల్లధనం మూల్గుతోందనీ... దాన్ని వెనక్కి తీసుకొస్తే ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమచేయవచ్చని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే... వంద రోజుల్లోగా నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. సామాన్యుడి ఆశలకు రెక్కలు తొడగడంతో పాటు మోదీని అమాంతం ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన ఈ హామీ నీటిమీద రాతేనని తేలిపోవడంతో... ఇప్పుడు ప్రతిపక్షాలు ఇదే అస్త్రంగా మోదీ, బీజేపీలను నిప్పుల మీద నిలబెట్టేందుకు సిద్ధమయ్యాయి.
తాజాగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై మాట్లాడుతూ.. ‘‘మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారిని ఓడిస్తాం. ఈ సారి కూడా మోదీనే ప్రధాన మంత్రి అవుతారు.’’ అని అన్నారు. దేశం దాటి వెళ్లిన నల్ల ధనాన్ని భాజపా అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో స్వదేశానికి రప్పించి ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. ఈ హామీని ఇప్పటివరకూ నెరవేర్చకపోవడంతో దీన్ని భాజపా తుంగలో తొక్కిందంటూ కాంగ్రెస్ తరచూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.