ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంటు ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. రామ్మోహన్ నాయుడు నిరసనకు మద్దతుగా టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్ లో మోడీని నిలదియ్యకుండా తెలుగుదేశం ఎంపీలను అన్ని విధాలుగా బెదిరించారు, మోడీ, షా.. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా, తెలుగుదేశం ఎంపీలు మాత్రం, వెనక్కు తగ్గలేదు. ఏపికి న్యాయం చెయ్యండంటూ పార్లమెంట్ లో టిడిపి ఎంపీల ఆందోళన కొనసాగిస్తున్నారు.
మరో పక్క, ఏపీకి న్యాయం చేయాలంటూ చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న రీతిలో నిరసనను తెలియజేస్తున్నారు. ప్రతీ రోజు పలు రకాల వేషధారణలతో పార్లమెంటుకు వస్తున్న ఎంపీ ఈరోజు జానపద కళాకారుడు వంగపండు వేషంలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్న మోదీ ఎన్నికలయ్యాక అన్నీ మరిచాడంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా రైల్వేజోన్ ఇతర హామీలను మరిచిన మోదీని ఓడించడానికి కదిలి రావాలంటూ యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారంటూ జానపదాలు పాడుతూ శివప్రసాద్ నిరసనను తెలియజేశారు.
‘ఏం పిల్లడో ఢిల్లీ వస్తవా.. ఏం అమ్మాయి ఢిల్లీ వస్తవా. ఢిల్లీలోనే మొండోడు(ప్రధాని మోదీ) ఉన్నడు. మొండోడిని కాదు.. నేను మొనగాడిని అంటడు. డ్రస్సులేమో తెగ జోరుగా ఏస్తడు. ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటడు. త్రీడీ ఎఫెక్టుతో ప్రధాని అయ్యుండు. ప్రజల గురించి అసలు ఆలోచించడు’ అంటూ ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ తనదైన శైలి వేషాలతో నిరసన తెలియజేస్తే ఏపీ వాయిస్ వినిపిస్తున్నారు శివప్రసాద్. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెదేపా లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం నేతృత్వంలో పార్టీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.