సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం వేకువజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు రక్తపోటు పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సుప్రజ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, ఛాతీ నొప్పితో మోత్కుపల్లి బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. మరోవైపు మోత్కుపల్లి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా ఆలేరు నుంచి బరిలో ఉన్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భువనగిరి ఏరియా ఆసుపత్రికి సరైన సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో, కుటుంబీకులు సొంత వాహనంలోనే ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు.
మరో పక్క, తెలంగాణలో పోలింగ్ భారీగా నమోదు అవుతోంది. ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ప్రతీ గంట గంటకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ఓటర్లు చురుగ్గా పోలింగ్‌లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 49 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇదే స్థాయిలో కొనసాగితే పోలింగ్ ముగిసే సమయానికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదు అవుతుందని ఈసీ భావిస్తోంది. అటు పోలింగ్ కేంద్రా వద్ద కూడా క్యూలైన్లు చకచకగా కదులుతున్నాయి. ఓటువేసే ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో ఓటర్లు కూడా ఉత్సాహంగా ఉన్నారు.
ఇప్పటికే సినీ ప్రముఖులు చాలా మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, నితిన్, రాజమౌళి, కీరవాణి, విజయశాంతి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని అంతా పిలుపునిచ్చారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని ఈసీ చెబుతున్నా అనేక పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచే జనం క్యూ లైన్లలో నించున్నారు. అయితే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. మహబూబాబాద్‌లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి.