ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా బీజేపీ ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు, మోడీ-షాలకు వ్యతిరేకంగా తయారయ్యాయి. ఆశ్చర్యంగా ఈ జాబితాలో జగన్, పవన్, కేసీఆర్ మాత్రమే లేరు. జగన, పవన్ లకి అసలు మోడీ అంటే, ఎందుకు అంత భయమో తెలియదు. కనీసం ఒక్క మాట కూడా, మోడీని అనరు. కేంద్రంలో సమస్య అయినా, చంద్రబాబునే తిడతారు. ఇక విభజన హామీల గురించి అయితే, మాట మాట్లడాలి అంటే భయం. జగన్, పవన్ చేస్తున్న ఈ పోరాటాల పై ప్రజలే కాదు, రాజకీయ పార్టీలు కూడా విసుగు చెందాయి. ఎంత భయపడినా, కనీసం మాట వరుసకు అయినా మోడీ అనే మాట వీరి నోట్లో నుంచి ఎందుకు రాదా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదే అంశం పై జగన్, పవన్ లను నిలదీస్తున్నారు.
నోట్ల రద్దు, ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని మోదీని జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు నిలదీశారు. ‘చాలా పోరాటాలు చూశాం. కానీ భాజపాపై జగన్ చేస్తున్న మౌన పోరాటం లాంటివి ఎప్పుడూ చూడలేదు. ప్రత్యేక హోదా ఇవ్వని భాజపాను ఓడించండని ఆయన ఎందుకు ప్రజలకు విజ్ఞప్తి చేయరు. భాజపాపై మౌనవ్రతం పాటించే ఆయన చంద్రబాబుపై మాత్రం అంతెత్తున లేస్తారు’ అని అని విమర్శించారు. జగన్ చేస్తున్న వీరోచిత పోరాటానికి, మౌన పోరాటం అని పేరు పెట్టారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ఆ పార్టీ ప్రాంతీయ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని భాజపా ప్రయత్నిస్తోందని అన్నారు.
"ఓట్ల కోసమే ఆ పార్టీ ప్రాంతాల పేర్లను మారుస్తోంది. మళ్లీ అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని తెరపైకి తెచ్చింది. భాజపాను ఓడించేందుకు మహాకూటమి ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు దేశమంతా తిరుగుతున్నారు. ఎన్నికల ముందు కూటములవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో భాజపాను ఓడించేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాత భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే మంచిది. రాంవిలాస్ పాసవాన్, నితీష్ కుమార్, శివసేన నేతలను వెలుపలకు తీసుకొచ్చి ఎన్‌డీఏను బలహీనపర్చాలి.’ అని రాఘవులు పేర్కొన్నారు.