ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బహిరంగ లేఖ రాశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీఎం చంద్రబాబు భేటీపై ఆరోపణలు చేస్తున్న నేతలు ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు. రాహుల్‌గాంధీని చంద్రబాబు కలిస్తే, ఏదో జరిగిపోయిందంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు తర్వాత బీజేపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? లక్ష్మీపార్వతి జగన్ కాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా? విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేశారు. మనకు తీరని అన్యాయం చేసినవారిపై తిరగబడి హ్కకులను కాపాడుకోవాలనుకోవడం తప్పా? అని లేఖలో కేఈ ప్రశ్నించారు.‘‘
వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ప్రజాక్షేత్రంలో పని చేయవు. మరో ఉద్యమానికి సిద్ధం కండి...బీజేపీ పాలనను అంతమొందించండి. బీజేపీ చేతిలో వైసీపీ కీలు బొమ్మగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవవస్థలను నిర్వీర్యం చేస్తోంది. బీజేపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కోవడానికి ఒక సమగ్రమైన పటిష్టమైన ఫ్రంట్ అవసరం. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా చంద్రబాబు నడుం కట్టారు. అన్ని పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని కేఈ కృష్ణమూర్తి సూచించారు. మరో మంత్రి, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా, ఈ విషయం పై స్పందించారు.
నరేంద్ర మోడీ తెలుగు వారి ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టారని అందుకే ఆయనకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాడుతున్నామని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు ఆత్మగౌరవం బాటలోనే చంద్రబాబు పయనిస్తూ దేశ రక్షణకు, భారతీయుల సంక్షేమానికి ముందడుగే సారన్నారు. రాష్ట్రం విడిపోయి, పూర్తిగా నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేసి గట్టెక్కిస్తా రని నమ్మి రాష్ట్రం మేలు కొరకు స్నేహం చేశామన్నారు. ఆయన మాట తప్పారని, హామీలు మరిచారని, విభజన చట్టంలో ఉన్న నిధులను కూడా ఇవ్వడం లేదని, హామీలు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు. రాను రాను రాష్ట్రం పై కక్ష కట్టారు అన్నారు. ప్రస్తుతం మోడీ బలమైన వ్యక్తి అని ఆయన విషసర్పం లా తయారై రాక్షసునిగా వ్యవహరిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఆయన ప్రభావం తగ్గించాలన్నా, పక్కకి తప్పించాలన్నా అన్ని పార్టీలు కలిసి పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇదివరలో కూడా జాతీయ స్థాయిలో సమన్వయకర్తగా నాయకుడిగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆయన వలననే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఏకం అయ్యాయన్నారు. అందుకు బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి ని ఉదాహరణగా ఆయన చెప్పారు.