మచిలీపట్నం పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ అంశం ఒక అడుగు ముందుకు పడింది. రైతుల భూములుకు నష్టపరిహారం ఇచ్చే అంశంలో ఇప్పటివరకూ రైతులు, ప్రభుత్వం మధ్య కొంత సందిగ్ధత నెలకొంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరా ఒక్కింటికి గరిష్టంగా రూ. 25 లక్షలు చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు జరిపిన భూ సేకరణలో ఆయా రైతులకు ఇచ్చిన రేట్లకంటే ఇదే అత్యధిక ధరగా నిలువనుంది. మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి 2,159.25 ఎకరాల పట్టా భూమిని రైతుల నుండి సమీకరించాల్సి ఉంది. మచిలీటపట్నం మండలంలోని మంగినపూడి, కరఅగ్రహారం, తవిశపూడి, గోపువాని పాలెం గ్రామాలకు చెందిన రైతుల నుండి ఈ భూ సేకరణ జరగాల్సి ఉంది.
మార్జిన్ అమౌంట్ కేటాయించిన అనంతరం భూ సమీకరణకోసం రుణం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భూములు ఇచ్చే రైతులకు నష్టపరిహారాన్ని నిర్ణయించింది. ఇప్పటికే అనేక సార్లు రైతులతో చర్చలు జరిపిన అనంతరం ఇప్పుడు రూ. 25 లక్షల వంతున చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూసేకరణలోని ఆలస్యాన్ని పరిగణలోకి తీసుకుని పరిమిత ల్యాండ్ పూలింగ్ పథకాలను కూడా పరిగణలోకి తసుకున్న అనంతరం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథా రిటీ (ముడా) వైస్ ఛైర్మన్, పోర్టు నిర్వహణ ఏజెన్సీ ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. రైతుల భూములకు సంబంధించి లాండ్ పర్చేజ్ స్కీం కింద ధర నిర్ణయించేందుకు ఒక కమిటీని నియమించాలని ఆ నివేదికలో కోరారు. ఈనేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయానికి ఈ ఏడాది మే నెలలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రైతులతో అనేకమార్లు చర్చలు జరిపిన అనంతరం రైతుల అంగీకారం మేరకు రూ. 25 లక్షలకు ఒక్కో ఎకరం అమ్మేందుకు వారిని ఒప్పించింది.
వాస్తవంగా 2008-09లోనే ఈ పోర్టు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తలంచినప్పటికీ భూసేకరణ పెద్ద అడ్డుగా నిలచింది. ముఖ్యంగా భూసే కరణ అంశంలో ప్రభుత్వ భూములే తీసుకోవా లంటూ ప్రజలు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నేపద్యంలో భూసేకరణ చేపట్టడంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీనికితోడు నిధుల కొరత కూడా ఉండటంతో పోర్టు నిర్మాణంపై అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో నిధుల కొరతను అధిగమించేందుకు ఫైన్షియల్ ఇనిస్టిట్యూష న్స్ నుండి రుణం పొందేలా ముడాకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చర్యలను చేపట్టడంతో మచి లీపట్నం పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకులు తొలగినట్లయింది.