‘నన్ను మానసికంగా దెబ్బతీయాలని.. తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని కేంద్రం కుయుక్తులు పన్నుతోంది. నన్నేమైనా చేయాలని.. సాధించాలని మోదీ చూస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. తనను భయపెట్టాలని చూస్తే గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గుంటూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనం శంకుస్థాపనకు వచ్చి.. ఉత్తరాంధ్రలో తితలీ తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించకుండా వెళ్లారని ఆక్షేపించారు. దేశంలో విపత్తులు సంభవిస్తే తక్షణమే స్పందించాల్సిన రాజ్‌నాథ్‌సింగ్ ఇలా చెయ్యవచ్చా అని అన్నారు.
శ్రీకాకుళంలోని టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాల్లో బుధవారం పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. ‘‘తిత్లీ తీరం దాటిన రోజే శ్రీకాకుళానికి వచ్చా. మధ్యలో ఒక్కరోజు విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్లాల్సి వచ్చింది. మీకందరికీ సహాయ కార్యక్రమాలు అందిస్తున్నా. ఇక్కడ సహాయ చర్యలు ఆగిపోవాలని కేంద్రం కుట్ర పన్నుతోంది. అందుకే ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లు, సంస్థలపై దాడులు చేయిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీ సహా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించానని.. నాపై కక్ష సాధిస్తోంది. నలభైయ్యేళ్ల రాజకీయ జీవితం నాది. నాతో ఆషామాషీలా’ అంటూ చంద్రబాబు కేంద్రంపై ధ్వజమెత్తారు.
మనం కష్టపడి పని చేస్తుంటే కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని, లేనిపోని విమర్శలు చేస్తున్నారని బాధగా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీకు ఇంత చేస్తుంటే పవన్ కల్యాణ్ నన్ను తిడతారు. ఎందుకు తిడతారో నాకే తెలియదు. తెలంగాణా సీఎం కేసీఆర్ నన్ను తిడతాడు. మోదీ చేతుల్లో ఉండి వారు మనతో ఆడుకుంటున్నారు. మీరందరూ ఉంటే కొండనైనా ఢీకొంటా.. రాజీపడను’ అన్నారు. ‘తితలీ తుఫాను పెనుప్రమాదం సృష్టిస్తుందని పసిగట్టిన వెంటనే సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించాను. ఐదు సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్దేశించాను. తర్వాత పలాస వచ్చి నాలుగు రోజులు మకాం వేసి బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు ప్రారంభించాను. ఏ ఒక్క కుటుంబం ధైర్యం కోల్పోకుండా అండగా ఉండాలని 15 మంది మంత్రులను, 150 మంది డిప్యూటీ కలెక్టర్లను, ఐఏఎస్ అధికారులను జిల్లాకు రప్పించాను. 3 లక్షల ఎకరాల్లో కొబ్బరి, 1200 హెక్టార్లలో జీడిమామిడి, లక్ష ఎకరాల్లో వరి పంట నాశనమయ్యాయి. 36 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం మనకు అండగా ఉండాలి. కానీ అదే సమయంలో మన ఎంపీలపై, ఎమ్మెల్యేలపైనా ఐటీ దాడులు చేయించింది." అని అన్నారు.