‘సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉంటే... రాజీనామాలతో ఖాళీ అయిన లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించకపోవడానికి అదే కారణం’’ అని ఎన్నికల కమిషన్(ఈసీ) స్పష్టం చేసింది. ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలకు ఉప ఎన్నికలు నిర్వహించక్కరలేదని తెలిపింది. మంగళవారం ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. ‘‘కర్ణాటకలో 3 స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలోని 5 లోక్‌సభ స్థానాలకు ముడిపెడుతూ మీడియాలో కథనాలు వచ్చాయి.
బళ్లారి, శివమొగ్గ, మాండ్య ఎంపీలు అసెంబ్లీకి ఎన్నిక కావడంతో లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఈ ఏడాది మే నెలలోనే ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. కానీ... ఏపీలోని ఐదు స్థానాలు జూన్ 20న ఖాళీ అయ్యాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 151ఏ ప్రకారం శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఖాళీ ఏర్పడిన 6 నెలల్లో ఎన్నికలు జరపాలి. అయితే, పదవీ కాలం ఏడాదిలోపు ఉంటే ఎన్నికలు నిర్వహించకూడదు. 16వ లోక్‌సభ కాలపరిమితి 2019 జూన్ 3తో ముగుస్తుంది. ఈ రీత్యా కర్ణాటకలో ఏడాది పదవీకాలం మిగిలి ఉండగానే ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం’’ అని ఈసీ వివరించింది.
వైసీపీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌కు ఇచ్చారు. వాటిని తక్షణం ఆమోదించి ఉంటే ఆ స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చేవి. కానీ జూన్ 20న వారి రాజీనామాలను ఆమోదించారు. ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగి తీరుతాయని, ‘హోదా’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధిస్తామని వైసీపీ తెలిపింది. శనివారం వెలువడిన నోటిఫికేషన్, ఈసీ ఇచ్చిన వివరణతో వారి వాదన నిజం కాదని తేలిపోయింది. అయితే అప్పటి నుంచి, ఈసీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేంద్రంతో కుమ్మక్కు అయ్యే జగన్ నాటకాలు ఆడుతున్నాడనే కధనాలు జాతీయ స్థాయిలో రావటంతో, ఎలక్షన్ కమిషన్ మరోసారి ఈ వివరణ ఇచ్చింది.