కేంద్రం పై భారీ పోరాటానికి ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికే ధర్మపోరాటం పేరుతో ఆరు వేర్వేరు వేదికలపై కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన చంద్రబాబు, మిగిలిన జిల్లాల్లో కూడా ఇవి త్వరగా పూర్తి చేసి, అమరావతిలో భారీ సభ పెట్టనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు ఓ వైపు పెట్టుబడుల ఆకర్షణ.. సంక్షేమ పథకాలతో బిజీగా ఉంటూనే, బహిరంగ సభలతో విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు ధర్మ పోరాట దీక్షను కొనసాగిస్తున్నారు.
నెలకొక ధర్మ పోరాట సభను నిర్వహిస్తూ దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కుట్రలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే తిరుపతి, ఒంగోలు, విశాఖ, కాకినాడ, కర్నూల్, తాడేపల్లి గూడెం నగరాల్లో సభల్లో నిప్పులు చెరిగిన ఆయన, మగిలిన జిల్లాల్లో ఇవి త్వరతిగతిన పూర్తి చెయ్యనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లోనూ.. నెలకొక్కటి చొప్పున ధర్మ పోరాట సభలు నిర్వహించి.. ఫైనల్‌గా జనవరిలో.. విజయవాడ, గుంటురు జిల్లాలకు సంబంధించిన ధర్మపోరాటసభను అమరావతిలో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది టీడీపీ.
ఆఖరు సభకు జాతీయ స్దాయి నేతలను సైతం పిలవాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున వీలైనంత త్వరగా.. ధర్మ పోరాట సభలు పూర్తిచేస్తే పార్టీకి బూస్ట్‌లా ఉపయోగపడుతుందనేది చంద్రబాబు ఆలోచనగా అనిపిస్తోంది. ధర్మ పోరాట సభల ద్వారా పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడంతో దానికి తగ్గట్టుగానే వ్యూహాలకు పదును పెడుతున్నారు. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు ధీటుగా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని, రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని, రాబోయే కాలంలో చేయబోయే అభివృద్ధిని.. ఈ ధర్మపోరాట సభల్లోనే వివరించాలని, తద్వారా ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని భావిస్తున్నారు.