వైఎస్ వివేక కేసు కూడా అన్ని కేసులు లాగే సాగుతూనే ఉంది. జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ కావటం, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసు పరుగులు పెడుతుందని అందరూ భావించిన తరుణంలో, ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఈ కేసు కూడా సాగుతూనే ఉంది. జగన్ మోహన్ రెడ్డి సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పటం, వివేక కుమార్తె కోర్ట్ కు వెళ్లి సిబిఐ విచారణ తెచ్చుకోవటం, తరువాత సిబిఐ రంగంలోకి దిగటం, రెండు నెలలకు ఒకసారి హడావిడి చేయటం, అదిగో పెద్ద తలకాయి అరెస్ట్, ఇదిగో అరెస్ట్ అని హడావిడి చేయటం, మళ్ళీ చప్పబడిపోవటం, ఇదే తంతు, గత రెండేళ్లుగా కొనసాగుతుంది. అయితే ఈ కేసులో, ప్రధాన నిందితుడు, అలాగే అప్రూవర్ గా మారి, మొత్తం విషయాలు అన్నీ చెప్పేసి, పెద్ద తలకాయలను ఇరికించిన వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి, మీడియా ముందుకు వచ్చారు. తన ప్రాణానికి హాని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా, పోలీసులు మాత్రం తనకు రక్షణ ఇవ్వటం లేదు అంటూ బాంబు పేల్చాడు. పులివెందుల దాటి బయటకు వెళ్తుంటే, తన వెంట అసలు సెక్యూరిటీనే ఉండటం లేదని అన్నారు. కోర్టు ఆదేశాలు ప్రకారం ఇచ్చిన గన్ మెన్లు నాతో ఉండట్లేదని దస్తగిరి చెప్పాడు.
బయటకు వెళ్ళే ప్రతి సారి, సిబిఐ అధికారులు ఫోన్ చేసి, వారికి వివరించి, సెక్యూరిటీ వాళ్ళు రాలేదని చెప్తే, వాళ్ళు పంపిస్తున్నారని, ప్రతి సారి సిబిఐ అధికారులకు ఫోన్ చేసి, అడగాలి అంటే ఇబ్బందిగా ఉందని దస్తగిరి అన్నారు. నాకు ఏమైనా జరిగి, ప్రాణ హాని జరిగితే, నా ప్రాణాలు తీసుకుని వస్తారా అని ప్రశ్నిస్తున్నాడు. తన కదలికలు తెలుసుకోవటానికి పోలీసులను ఉపయోగించుకుంటున్నారు కానీ, తనకు రక్షణగా మాత్రం ఉండటం లేదని, కోర్టు ఆదేశాలు కూడా పాటించటం లేదు అంటూ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేసారు. కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినా, కోర్టు వెళ్లి తేల్చుకోవాలని పోలీసులు అంటున్నారు అంటూ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు దస్తగిరికి భద్రత ఇవ్వటం లేదు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దస్తగిరి ఈ కేసులో కీలక వ్యక్తి. ఎందుకు చంపాడు, ఎవరు చంపమంటే చంపాడు దగ్గర నుంచి, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి, అప్రూవర్ గా మారితే, ఎందుకు ఇలా చేస్తున్నారో మరి ?