నోటికి వచ్చిన రాజకీయ ఆరోపణలు చేసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, తన ఫాన్స్ ని రంజింప చేస్తే చాలు అని అనుకునే, పవన్ కళ్యాణ్ కు, పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నన్ను చంపటానికి ప్లాన్ చేసారు. ఎవరో ముగ్గురు నా హత్యకు ప్లాన్ చేసారు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు తోసేసి, నన్ను చంపాలని చూస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్, రెండు రోజుల క్రిందట ఒక మీటింగ్ లో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఎవరు చంపుతారు, ఆయనేమన్నా పెద్ద బలవంతుండా అనే చర్చ మొదలైంది. ఇదంతా సానుభూతి కోసం, పాతకాలపు నాటి ఐడియా అని అంటున్నారు.
ఇది ఇలా ఉంటే, దీని పై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ స్పందించారు. పవన్ కళ్యాణ్ కు లేఖ రాసారు. మిమ్మల్ని ఎవరో ముగ్గురు చంపటానికి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు, వీడియో ఉంది అంటున్నారు, ఆ ముగ్గురెవరో చెప్పాలని, ఆధారాలు ఏమైనా ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భద్రతను కూడా పెంచుతున్నామన్నారు. జిల్లాలో ఆయన పర్యటన జరిగినన్ని రోజులు వ్యక్తిగత భద్రతతో పాటు, ఆయన పాల్గొనే కార్యక్రమాలకు అదనపు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు పవన్ ఆ ముగ్గురు ఎవరో చెప్పాలి, వీడియో పోలీసులకి ఇవ్వాలి. లేకపోతే, తాను చేసినవి గాలి ఆరోపణలే అని ప్రజలు నమ్ముతారు.
దీని పై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. ప్రాణహాని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదని, ఆయనకు ప్రాణహాని ఉందని చెబితే భద్రత కల్పిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకముండాలని చెప్పారు. ఇలా స్పందిస్తూ ఉండగానే, విలేకరి మరోసారి పవన్ మీద కుట్ర, దాడి అని చెప్పి ప్రశ్నలు అడుగుతుంటే, దానికి సమాధానం చెప్తూ, "నీకు ఏమైనా ఫండమెంటల్స్ తెలుసా. ఏదిబడితే అది మాట్లాడే వాళ్ళ మాటలు పట్టుకొని, అడగడం కరెక్ట్ కాదు ఆయన భద్రత వ్యవహారం పోలీసులు చూసుకుంటారు. ఆయనకు అనుమానాలుంటే చెప్పాలి" అంటూ పవన్ చేస్తున్న గాలి ఆరోపణల పై చంద్రబాబు బదులు ఇచ్చారు.