శాసన సభను రద్దు చేస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో, తెలంగాణలో ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. కేసీఆర్ నిర్ణయాన్ని తప్పని ఓ వైపు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే... ఎలాగైనా సరే ఈ సారి టీఆర్ఎస్ను ఓడిండాలని కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలో, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి నాయకులు లేకపోయినా, క్యాడర్ ఇప్పటికీ అలాగే ఉంది. హైదరబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో, వీళ్ళు గట్టిగా ప్రభావం చూపిస్తారు. అలాగే సంస్థాగతంగా, తెలంగాణా బీసీల్లో తెలుగుదేశం అంటే ఇప్పటికీ అభిమానం ఉంది. ఈ నేపధ్యంలోనే, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు అని కాంగ్రెస్ భావిస్తుంది.
మరో పక్క, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, బీజేపీ పై పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేస్తుంది అనే అభిప్రాయం ఇక్కడ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ఎలాగూ ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు అయిపొయింది. ఇప్పుడు మోడీతో, కెసిఆర్ అంటకాగుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఏ విషయంలోనూ కెసిఆర్ కలిసి రావటం లేదు. అందుకే కెసిఆర్ ను దించటానికి, తెలంగాణాలో మాత్రమే కాంగ్రెస్ తో వెళ్తే ఎలా ఉంటుంది అనే చర్చ తెలంగాణా తెలుగుదేశంలో మొదలైంది. కాంగ్రెస్ కనుక తనంతట తాను, తెలుగుదేశం వద్దకు పొత్తుకు వస్తే, ఆలోచిద్దాం అనే అభిప్రాయంలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఇలా ఉండగానే, కెసిఆర్ నిన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబుని తిట్టటం, ఆంధ్రా ప్రాంతం వారి పై మరోసారి విషం చిమ్మారు.
ఇవన్నీ అటుంచితే... తెలంగాణలో పొత్తు విషయమై టీడీపీతో చర్చించాలని ముగ్గురు కీలక నేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగి హస్తం గూటికి చేరిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ కీలక నేత మధుయాష్కీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బోస్ రాజులకు బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీడీపీ కీలక నేతలతో చర్చలు ఎప్పుడు.. ఎక్కడ జరపాలన్న దానిపై అధిష్ఠానం ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో ముగ్గురు కీలక నేతలు రంగంలోకి దింపి.. తెలంగాణకు చెందిన టీడీపీ కీలక నేతలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యి చర్చిస్తారని సమాచారం.