గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దనరావు అంటే తెలియని వారు ఉండరు. ఆయాన పార్టీ పెట్టిన మొదటి నుంచి, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పేరు ఉంది. గతంలో నియోజకవర్గంలో వంశీతో కొన్ని ఇబ్బందులు వచ్చినా, వంశీకి టికెట్ ఇవ్వటం, వంశీ గెలవటంతో, అప్పటి నుంచి వంశీకి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వివాదాలు జోలికి పోకుండా, ఆయన పని ఆయన చేసుకుంటూ, పార్టీలో ఎంతో గౌరవం ఉన్న నేత. అయితే, ఆయాన తాజాగా చేసిన పనితో, ఇటు కార్యకర్తలే కాదు, ఇటు అధిష్టానం కూడా ఆశ్చర్యపోయింది. చంద్రబాబు పిలిపించి, దాసరిని మందలించే దాకా వెళ్ళింది. అసలు వివాదానికి కారణం, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దనరావు, వైసిపీ నాయకుడి సపోర్ట్ తీసుకోవటం.
విజయ డెయిరీలో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ల పదవులకు పోటీ తీవ్రంగా ఉండటంతో చంద్రబాబు స్వయంగా జిల్లా నేతలతో మాట్లాడి ఎంపిక చేశారు. దాసరి బాలవర్దనరావుకు కూడా ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారు. అయితే, ఎమ్మల్యే వంశీ ముందు దీనికి అంగీకరించకపోయినా, చంద్రబాబు చెప్పటంతో ఒప్పుకున్నారు. నామినేషన్ వెయ్యటానికి, వంశీని కూడా వెళ్ళమన్నారు. అయితే, గురువారం మధ్యాహ్నం నామినేషన్ వేసిన దాసరి తనకు మద్దతుదారుగా వైసీపీకి చెందిన సొసైటీ అధ్యక్షుడితో నామినేషన్ ఫాంపై సంతకాలు చేయించడం పార్టీలో కలకలం రేపింది.
ఈ విషయం పై, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసారు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో శుక్రవారం ఉదయం అందరిని పిలిపించారు. బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే దాసరి, గన్నవరం పార్టీ నాయకులతో ముందుగా పార్టీ కార్యదర్శి తొండెపు దశరథ జనార్దన్ మాట్లాడారు. తరువాత జరిగిన విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు వారిని తన రూంలోకి పిలిపించి దాసరిపై ఫైర్ అయ్యారు. డైరెక్టర్ పదవికి మీకు వైసీపీ సహకారం కావలసి వచ్చిందా? వారితో సంతకాలు చేయించడం ఏమిటి? ఇదేం పద్ధతని గట్టిగా ప్రశ్నించారు. మీరు కూడా ఎమ్మెల్యేగా చేశారు కదా గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదా అని నిలదీశారు. సీనియర్ నేత అయిన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగారు. దాసరి కూడా దీనికి సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో ఇక నుంచి ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పారు.