శ్రీరాముడు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్‌కు హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వర్గం వారి మనోభావాలను దెబ్బ తీస్తుండటంతో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ పోలీసు. ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన అధికారులు, ఇతన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగిస్తున్నామని హైదరాబాద్ పోలీస్, మీడియాతో చెప్పారు. అతను హైదరాబాద్ తిరిగి రావటానికి వీలు లేదని చెప్పారు.
అయితే, అతన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం పై, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అభ్యంతరం చెప్పటంతో, కత్తి మహేష్ ను పోలీసులు కర్ణాటకలో విడిచిపెట్టినట్టు సమాచారం. కాగా, కొంత కాలంగా మహేశ్ బెంగళూరులో ఉంటున్నాడు. అయితే, ఈ రోజు కత్తి ఉన్నట్టు ఉండి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షం అయ్యారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇకపై విజయవాడలోనే ఉండబోతున్నట్లు ప్రకటించాడు. ఇక తనపై హైదరాబాద్ నగరంలోకి వెళ్లకుండా మాత్రమే నిషేధం ఉందనీ, మిగతా తెలంగాణలో స్వేచ్ఛగా పర్యటించవచ్చని వెల్లడించాడు.
తనది ఏపీయేనని మహేశ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను విజయవాడకు షిఫ్ట్ అవుతున్నట్లు వెల్లడించాడు. తాను అంధ్రప్రదేశ్‌కి చెందిన వాడిని కాబట్టి ఇక నుంచి విజయవాడలో ఉండేందుకు గన్నవరం వచ్చానని తెలిపారు. ఓ ఛానల్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు కత్తి మహేష్‌పై విరుచుకుపడ్డారు. కత్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ బంపర్ ఆఫర్ విజయవాడ వాసులకు తగిలింది. మరి ఏపి పోలీసులు ఏ నిర్ణయం తీసుకొంటారో చూడాలి..