ఈ రోజు సాయంత్రం ఎవరూ ఊహించని విధంగా, మాజీ డీజీపీ సాంబశివరావు, వైసీపీ అధినేత జగన్ ను కలవటం దుమారం రేపింది. విశాఖపట్నం జిల్లా, రాంబెల్లి మండలంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో మాజీ డీజీపీ, జగన్ను కలిశారు. అయితే, ఆయన జగన్ ను కలిసిన తరువాత విలేకరులతో మాట్లాడకుండా, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన వెంటనే, సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయన చేరిక దాదాపు ఖాయం అయ్యిందని, ఆయన పార్టీలో చేరటంతో, మా పార్టీ మరింత బలం పుంజుకుంది అంటూ హడావిడి చేసారు. దీనికి తోడు సాక్షి కూడా, ఆయనకు ఒంగోలు టికెట్ ఇస్తున్నట్టు ప్రచారం చేసారు.
అయితే ఈ ప్రచారాన్ని మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు. తాను వైకాపాలో చేరుతున్నాను అంటూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను సాంబశివరావు ఖండించారు. ఆయన చెప్పింది అవాస్తవం అని చెప్పారు. తాను జగన్ను కలవటంలో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాద పూర్వకంగానే జగన్ను కలిశానని వెల్లడించారు. ఆయన్ను ప్రతిపక్ష నేత హోదాలో కలిసాను అని, గతంలో కూడా వైజాగ్ సీపీగా పనిచేసినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును కూడా కలిశానని వివరించారు. ఇప్పటికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచలన లేదని, విజయసాయి వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు చెప్పారు.
సాంబశివరావు, జగన్ ను కలవగానే రకరకాల ప్రచారాలు వచ్చాయి. వ్యక్తిగతంగా సాంబశివరావు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఒక వైపు చేస్తే, మరో పక్క మంత్రి అఖిల ప్రియ పెళ్లి విషయంలో, ఇబ్బంది అంటూ మరొక ప్రచారం జరిగింది. అయితే, ఇప్పటి వరకు, సాంబశివరావు ఎప్పుడు చంద్రబాబు పై అసంతృప్తి చూపించలేదు. చంద్రబాబు కూడా, సాంబశివరావుని డీజీపీగా కొనసాగించాలని కేంద్రంతో పోరాడారు. అయితే ఆ ప్రతిపాదనలను కేంద్ర హోంశాఖ నుంచి వెనక్కి వచ్చాయి. అయితే డీజీపీగా రిటైర్డ్ అయిన తరువాత కూడా చంద్రబాబు ఆయనకు, విశాఖపట్నం గంగవరం పోర్టు చీఫ్ సెక్యూరిటి అధికారిగా నియమించారు.