చంద్రబాబు సంకల్పానికి ప్రకృతి కూడా తోడయ్యింది... ఎప్పుడూ అక్టోబర్ లో తెరుచుకునే శ్రీశైలం గేట్లు, ఈ సారి ఆగష్టు లోనే తెరుచుకున్నాయి.. శ్రీశైలం ప్రాజెక్టుకు చెందిన 4 గేట్లను శనివారం ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో నాలుగు గేట్లను ఆదివారం ఉదయం ఎత్తివేశారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దాదాపు లక్ష క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కాగా... ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.7 అడుగులుగా ఉంది.
ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. 3 రోజుల్లోనే శ్రీశైలానికి 9లక్షల క్యూసెక్కుల (70-80 టీఎంసీలు) వరద నీరు చేరింది. దాంతో, ఇప్పటి వరకూ జల విద్యుదుత్పత్తి కోసమే నీటిని వినియోగిస్తున్న అధికారులు.. ప్రాజెక్టు గేట్లను ఎత్తి కొంత నీటిని దిగువనున్న నాగార్జున సాగర్‌కు విడుదల చేసారు. కృష్ణా నది జన్మస్థానం మహాబలేశ్వరంతోపాటు పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆలమట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. కర్ణాటకలోని ఆలమట్టికి శుక్రవారం 1,27,216 క్యూసెక్కుల వరద వస్తే.. 1,42,865 క్యూసెక్కులను దిగువకు వదిలారు. నారాయణపూర్, జూరాలను దాటుకుని శ్రీశైలానికి మొత్తంగా 1.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఇక, తుంగభద్ర డ్యామ్‌కు గడచిన దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత వరద పోటెత్తుతోంది.
ఏకంగా 2లక్షల క్యూసెక్కుల వరద తుంగభద్ర జలాశయంలోకి చేరుతోంది. దాంతో, ప్రాజెక్టుకున్న మొత్తం 33 గేట్లనూ ఎత్తివేశారు. డ్యామ్ నుంచి 2.20 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వెరసి, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అంటే, రోజుకు 30 టీఎంసీల నీరు శ్రీశైలం చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, శుక్రవారంనాటికి 180 టీఎంసీలకు చేరింది. మరో 35 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండిపోనుంది. దాంతో, గేట్లను తెరిచి సాగర్‌లోకి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక్కడి నుంచి జల విద్యుదుత్పత్తికి 90 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండడంతో గురువారం రాత్రి నుంచి సాగర్‌కు 65,371 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇతర ప్రాజెక్టుల కోసం మరో 10 వేల క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటకలోని కోస్తా, మల్నాడ్ ప్రాంతాల్లో ఈనెల 14వ తేదీ నుంచి కురుస్తున్న ఎడతెరపిలేని వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.