కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో పవన్-జగన్-బీజేపీ కలిసి పన్నిన వ్యూహం పై తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు, కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని, తాను చేసేది ఏమీ లేదంటూ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో చేసిన ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని తెలుగుదేశం భావిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రభావం కాపుల్లో ఎక్కువుగా ఉండటంతో ఆ ఓటు బ్యాంకు తన వైపుకు రాదని భావించిన జగన్ బీసీల ఓట్లకు గాలం వేశారనేది తాజా వ్యూహంగా కనిపిస్తుంది. అదే విధంగా, కాపు ఓట్లు అన్నీ పవన్ కు కాన్సాలిడేట్ అయ్యేలా, బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేసిందనే వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌పై జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలు, ఉపసంహరించుకోవడం కానీ, లేదా వివరణ ఇవ్వడం కానీ చేయలేదు.
జగన్‌పై కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత పార్టీలోని కాపు నేతలే దీన్ని సమర్థించలేకపోతు్ననారు. ముద్రగడ పద్మనాభం కూడా తన ఆగ్రహాన్ని దాచుకోలేదు. తన విధానంలో మర్పు ఉండదని, బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు రిజర్వేషన్లు ఎలా చేయవచ్చో తనకు చెప్పాలంటూ ఆదివారం పార్టీ నేతల వద్ద జగన్ వెటకారం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాపు ఓట్లు పవన్ వైపు మొగ్గితే బీసీ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవచ్చని జగన్ రిజర్వేషన్లపై ప్రకటన చేసి ఉంటారని టీడీపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై బీసీల్లో అసంతృప్తి కూడా ఉందని.. ఆ ఓటు బ్యాంకు తనవైపుకు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
జగన్ వ్యూహాన్ని గమనించిన టీడీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు. ఈ సారి సార్వత్రిక కులాల పోలరైజేషన్ జరుగుతుందని భావిస్తున్న తరుణంలో తాజాగా కాపు ఓటు బ్యాంకు జగన్‌కు దూరమవటం ఎపీ రాజకీయాల్లో కొత్త పరిణామంగా భావించవచ్చు. కొంతమంది సంప్రదాయంగా వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులుగా ఉన్న కాపులు జగన్‌తో కూడా నడుస్తున్నారు. కానీ జగన్ కామెంట్లతో వారు వైసీపీకి దూరమయ్యారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలు కూడా జగన్ వ్యాఖ్యల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఎటువంటి ఉద్దేశం ఉన్నప్పటికీ... బీసీ ఓటు బ్యాంకు సంప్రదాయ బద్దంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని, ఆ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకోవడం అనేది అసాధ్యమనేది వైసీపీలోని ఓ కాపు నేత విశ్లేషణ. అటు కాపుల ఓట్లు పడకపోగా, ఇటు బీసీలు కూడా ఆదరించని పక్షంలో రెండింటికీ చెడిన రేవడి అవుతుందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.