విభజన హామీల విషయంలో సుప్రీం కోర్టులో కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్‌గా జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మానవ వనురుల శాఖ తాజా అఫిడవిట్ సుప్రీం కోర్టుకు సమర్పించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉందని తన అఫిడవిట్లో పేర్కొంది. రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు మిగతా విద్యాసంస్థల ఏర్పాటు, తరగుతల నిర్వహణ వంటి అంశాలపై వివరణ ఇచ్చింది. అయితే గిరిజన వర్సిటీ, సెంట్రల్ వర్సిటీపై హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పిన మాటకు.. అఫిడవిట్లో పేర్కొన్న అంశానికీ పొంతన లేదు.
దీంతో కేంద్రం తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి వర్సిటీల్లో క్లాసులు ప్రారంభిస్తామని ప్రకాశ్ జవదేకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం దీనికి విరుద్ధంగా సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. అంతకుముందు దాఖలు కేంద్రం చేసిన అఫిడవిట్లో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్, తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కావని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. హోంశాఖ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమయినట్టు తెలిపింది. రాష్ట్రానికి రైల్వేజోన్ ఇచ్చి తీరుతామని లోక్‌సభలో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన కొన్ని రోజులకే అందుకు భిన్నంగా అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.
దీని పై చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆశలన్నీ పార్లమెంట్‌పైనే ఉన్నందున... ఎంపీలంతా హక్కుల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపైనా భాజపా మోసాన్ని ఎండగట్టాలని సూచించారు. కేంద్రం చెప్పేదొకటి, చేసేదొకటన్న విషయం అఫిడవిట్లలో తేలిపోయిందన్న చంద్రబాబు...., కేసుల మాఫీపై తప్ప జగన్ దృష్టి మరి దేనిపైగా లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై జగన్ మోసాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ముస్లిం మైనారిటీలు భాజపాకు పూర్తిగా దూరమయ్యారని.. అలాంటి భాజపాతో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు.