ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుతో ఆది నుంచి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి వైరం ఉంటూనే ఉంది. తనను రామోజీరావు శత్రువుగా భావించి, ముఖ్యమంత్రి పదవి దక్కనీయకుండా చేశారనే బాధ వై.ఎస్‌కు ఉండేది. సిఎం అయిన తొలినాళ్లలో, వై.ఎస్. రామోజీతో రాజీకి రాయభారం నడిపి విఫలమయ్యారు. ఇక తరువాత రామోజీ అంతు చూడాలనే తపనతో పలు మార్గాలు వెతికి కొన్నాళ్లు ఇబ్బందులు పెట్టారు. తరువాత ఆయన హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించడంతో వారసత్వంగా వచ్చిన వైరాన్ని జగన్ కొనసాగించారు.
రామోజీ'కి వ్యతిరేకంగా పత్రికను నడిపి ఆయన నగ్న కార్టూన్ లను తమ పత్రికల్లో ప్రచురించి తాను వైరాన్ని ఎంత బాగా నడపగలరో చూపించుకున్నారు. అయితే తరువాత మారిన పరిస్థితుల్లో తానే స్వయంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లి ఆయనతో సంధి చేసుకున్నారు. ఈ సంధి గత కొంత కాలంగా సాగుతూనే ఉంది. ఇరువైపుల నుంచి ఎటువంటి ఘర్షణలు, దూషణలు, ఇతర వైరాలు లేకపోయినా ఇప్పుడు మళ్లీ జగన్ క్యాంపు రామోజీరావును టార్గెట్ చేసుకుని తన పత్రికలో కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. దీంతో రామోజీ, జగన్‌ల మధ్య వైరం కొనసాగుతూనే ఉందనిస్పష్టమైంది.
గతంలో రాజగురువు అంటూ పదే పదే చెప్పిన సాక్షి మళ్లీ అదే పదాన్ని ఉపయోగిస్తూ మళ్లీ కథనాలను ప్రచురిస్తోంది. తాజాగా బిజెపి,టిడిపిల మధ్య సయోధ్యకు రాజగురువు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ పత్రికల్లో కథనాలు ప్రచురిస్తోంది. పైగా పార్టీ నాయకులతో ఆ విషయం గురించి పత్రికా సమావేశాలు పెట్టి చెప్పిస్తోంది. జగన్ మళ్లీ రామోజీరావుతో ఎందుకు సున్నం పెట్టుకుంటున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. తన సభలకు జనాలు వస్తూండడం చూసి తాను సిఎంను అవుతానన్న భావనతోనే రామోజీతో వైరానికి జగన్ సిద్ధం అవుతున్నారా అనే మాట రాజకీయ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.