నిన్న మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి.. "నేను గట్టిగా తలుచుకుని, కష్టపడితే 5 సంవత్సరాల్లో సియం అయిపోతా" అని అన్నారు.. ఈ సినిమా వాళ్ళు అందరూ ఇలా తమకి తాము గొప్పగా అతీత శక్తులులాగా ఊహించుకుంటారు అనుకుంటా అని అనుకుంటున్న టైంలో, ఈ మాటలు నిజం చేస్తూ ఉత్తరప్రదేశ్ లోని మథుర బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నేను తలచుకుంటే నిమిషంలో సీఎంను కాగలను. అయితే, ఆ పదవిపై నాకు వ్యామోహం లేదు’ అని అన్నారు. సీఎం అయితే చాలా ఆసక్తులను కోల్పోవాల్సి వస్తుందని, స్వేచ్ఛ హరించుకుపోతోందని, అందుకే, ఆ పదవిని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. బాలీవుడ్ ‘డ్రీమ్ గార్ల్’ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం వల్లే తాను రాజకీయాల్లోకి రాగలిగానని చెప్పారు.
తాను ఎంపీ కావడానికి ముందే బీజేపీ తరపున చేయాల్సిన మంచి పనులన్నీ చేసేశానని అన్నారు. గత నాలుగేళ్లుగా తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పిన హేమమాలిని, ప్రధాని మోదీపై, ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి పీఠాల కోసం తలపండిన రాజకీయాల నాయకులు ఆపసోపాలు పడుతుంటారు. ఓ పక్క జనం ఓట్ల కోసం, మరో పక్క అధిష్టానం కరుణ కోసం దేబిరిస్తూ ఉంటారు. తెరవెనుక కూడా నానా కథలూ నడిపిస్తుంటారు. సీఎం కావడం అంతకష్టమైన పని మరి. అయితే, ఇలాంటి సినిమా వాళ్ళు మాత్రం, టైం చెప్పి మరీ, మేము తలుచుకుంటే సియం అయిపోతాం అంటున్నారు.