రాజధాని అమరావతి పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇచ్చి, రేపటితో నెల రోజులు అవుతుంది. నెల రోజుల్లో రాజధాని రైతులకు భూసమీకరణ ఒప్పందం ప్రకారం ఇచ్చిన ఫ్లాట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన అనేది పూర్తి చేసి, అఫిడవిట్ దాఖలు చేయాలని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం గత రాత్రి 190 పేజీల అఫిడవిట్ ను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేత, రాష్ట్ర హైకోర్టుకు సమర్పించింది. ఈ అఫిడవిట్ లో పలు కీలక అంశాలతో పాటుగా, ఆశ్చర్యకరమైన అంశాలు కూడా పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా, సీఆర్డీఏ చట్టంలో పనులు పూర్తి చేసేందుకు, మూడు ఏళ్ళు సమయం ఇచ్చారని, మూడేళ్ళ సమయంలో పూర్తి చేయాలని పేర్కొన్నారని, కానీ సీఆర్డీఏ పాలక వర్గం 30వ సమావేశంలో, ఈ గడువుని మరో నాలుగేళ్ళు పొడిగించామని అందులో పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ళ గడువు, 2024 జనవరితో ముగుస్తుందని, అందులో వివరించారు. గత ప్రభుత్వం 42 వేల కోట్ల రూపాయలకు రాజధానిలో పనులు చేపట్టిందని, ఇందులో పనులు అన్నీ గ్రౌండ్ అయ్యాయి అని, ఇందులో దాదాపుగా, 8 వేల కోట్లకు సంబంధించి, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి డబ్బులు తీసుకుని రావటంతో, వాటికి వడ్డీ చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇవన్నీ చేయాలి అంటే ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని, ఒకేసారి రాజధానిలో ఇంత మొత్తం పెట్టుబడి పెట్టటానికి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సరిపోదని, దానికి సంబందించిన మీమంస కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ పనులు అన్నీ పూర్తి చేయాలి అంటే, తమకు మరో 5 ఏళ్ళు గడువు కావాలని పేర్కొన్నారు. దీంతో పాటుగా, రాజధానికి సంబంధించి, రైతులకు ఇచ్చే ఫ్లాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే సీఆర్దీఏ 17,357 ప్లాట్లను రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉన్నాయని, ఇందులో 1,598 ప్లాట్ల పై కేసులు ఉన్నాయని, ఈ కేసుల పై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, అపీల్ కు వెళ్ళాలా వద్దా అనే విషయం పై కూడా చర్చ చేస్తున్నామని పేర్కొన్నారు. నెల రోజులు గడవు సరిపోదని, తమకు 5 ఏళ్ళ గడువు కావాలని పేర్కొన్నారు. మరి దీని పైన హైకోర్టు ఈ అంశం పై, ఈ అఫిడవిట్ పరిగణలోకి తీసుకుని, ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనే విషయం పై ఆసక్తి నెలకొంది.