ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో, వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీనియర్ వైస్ ప్రసిడెంట్ సంజీవ్ రెడ్డి సమావేశం అయ్యారు. రాష్ట్రంలో, 150 ఎకరాల్లో అత్యాధునిక గిడ్డంగులు నిర్మించి, 10 వేలమందికి ఉపాధి కలిపించే ఆలోచనలో ఉన్నామని సంజీవ్ వివరించారు. స్థానిక రైతులు తమ ఉత్పత్తులను వాల్‌మార్ట్ ద్వారా విక్రయించుకునేందుకు సహకరిస్తామని, తాము ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో వ్యాపారావకాశాల కల్పనలో రోల్‌మోడల్‌గా ఉన్నామని తెలిపారు. వాల్‌మార్ట్ 50 వేల కోట్ల టర్నోవర్ కలిగి ఉందని, ఏడాదికి 60 శాతం వృద్ది సాధిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే భారతదేశంలో 4 ప్రాంతాల్లో అతిపెద్ద నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేసి, భారీ ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చైన్ ఏర్పాటు చేసామని చెప్పారు.
స్మార్ట్ ఫోన్లు,వివిధ కంపెనీలు తయారు చేసే వస్త్రాలు వంటి అనేక ఉత్పత్తులను దేశవ్యాప్తంగా రీటైలర్లకు సరఫరా చేస్తున్నామని, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి ఉత్పత్తులను సేకరించి, వాటిని సరఫరా చేసేందుకు మేము సమర్ధ రవాణా వ్యవస్థ కలిగి ఉన్నామని వివరించారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ, వాల్‌మార్ట్ తన వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి, తమ సెంటర్లు నెలకొల్పడానికి అనంతపురము అత్యంత అనుకూల ప్రాంతమని అన్నారు. వాల్‌మార్ట్‌కు ఎంతో కీలకమైన ఆహార శుద్ధి రంగానికి ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని అనంతపురము జిల్లాలో వాల్‌మార్ట్ తమ సెంటర్ ఏర్పాటు చేస్తే చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా వంటి ప్రాంతాలకు సరఫరా చేసేందుకు మరింత వీలుగా ఉంటుందని చంద్రబాబు సూచించారు.
దేశంలోని అన్ని ప్రాంతాలకూ రవాణా మార్గాలు కలిగి ఉండటం మా రాష్ట్ర విశేషమని, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభానికి పూర్తీ సహకారం అందిస్తామని చెప్పారు. "ఏపీ మీకు గ్లోబల్ సోర్సింగ్ సెంటర్‌గా ఉంటుంది. మేము వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యదిక వృద్ది నమోదు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఈ ఉత్పత్తులను వాల్‌మార్ట్ బ్రాండ్ ద్వారా అందించవచ్చు. రాష్ట్రంలో మీకు స్నేహపూర్వక వాణిజ్య వాతావరణం ఉంటుంది. ఇక్కడ పూర్తి పారదర్శక ప్రభుత్వం ఉంది. సాధ్యమైనంత త్వరలో వాల్‌మార్ట్ తన కార్యకలాపాలు ఇక్కడ నుంచి ప్రారంభించాలని కోరుకుంటున్నాం" అని చంద్రబాబు వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ గ్రూపు సీనియర్ వైస్ ప్రసిడెంట్ సంజీవ్ రెడ్డితో చెప్పారు.