పేదల కడుపు నింపడానికి... అన్న క్యాంటిన్లు సిద్ధమవుతున్నాయి. రేపు (జూలై 11న ) రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. తక్కువ ధరకే రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటుచేస్తోంది. ఇవి రంగుల హంగులు అమర్చుకుని, గాజు తలుపులు, అంతర్గత అలంకరణ, నిఘా నిత్రాలు.. నగరంలోని రెస్టారెంట్ల మాదిరి.. క్లాస్లుక్ తో కనిపిస్తున్నాయి. పేద , మధ్యతరగతి వర్గాలకు ‘అక్షయపాత్రతో వేడివేడిగా అల్పాహారం, కేవలం ఐదు రూపాయలకే భోజనం వడ్డించడానికి .. బుధవారం నుంచి అధికారికంగా అన్న క్యాంటిన్లు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని విద్యాధరపురం, నల్లగేట్, ధర్నా చౌక్ లో తొలుత ప్రారంభం కానున్నాయి. రెండు రోజులుగా ఆహార పదార్థాల పంపిణీ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
పేద, మధ్యతరగతి వర్గాల కోసం ప్రభుత్వం విజయవాడ నగరానికి 16, మచిలీపట్నంకు ఒకటి, గుడివాడకు రెండు అన్న క్యాంటిన్లను మంజూరు చేసింది. విజయవాడలో మూడు క్యాంటిన్లు ప్రారంభానికి సిద్దం కాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. నగరంలో ప్రస్తుతం 11 చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరో ఐదు చోట్ల స్థలాన్వేషణ సాగిస్తున్నారు. నగరంలో విద్యాధరపురం (ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు), హెచ్ బీ కాలనీ ( భవానీపురం) , సింగ్ నగర్ (ఫ్లై ఓవర్ దిగువన), అయోధ్యనగర్, రాణిగారితోట (కృష్ణలంక), నల్లగేటు స్కూల్ (కృష్ణలంక), సాయిబాబా గుడి (కృష్ణలంక), ధర్నా చౌక్ (అలంకార్ సెంటర్), అల్లూరి సీతారామరాజు వంతెన, హైస్కూల్ రోడ్డు (పటమట), గాంధీజీ హై స్కూల్ ( వన్ టౌన్)లో అన్న క్యాంటిన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటిలో విద్యాధర పురంలోని ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు , ధర్నా చౌక్, నల్లగేటు స్కూల్ (కృష్ణలంక) వద్ద నిర్మిస్తున్న అన్న క్యాంటిన్లు పూర్తిగా రూపుదిద్దుకున్నాయి, ఇవి రేపు ప్రారంభం అవుతాయి.
మిగిలినవి త్వరలో ప్రారంభిస్తారు. స్థలాలను ఇంకా కేటాయించకపోవడంతో రాజీవ్ నగర్ (సెంట్రల్), మధురానగర్ (సెంట్రల్), గీతానగర్ (కృష్ణలంక), సీఎం ఇంటి వద్ద (తాడేపల్లి ) పనులు ఇంకా మొదలుకాలేదు. ఆధునిక రెస్టారెంట్ల తరహాలో ఆధునిక రెస్టారెంట్ల తరహాలో క్యాంటిన్లు నిర్మిస్తున్నారు. ఆరంభమే అదిరేలా కనిపిస్తోంది. పసుపు, ఎర్రటి రంగులతో అన్న క్యాంటిన్లకు డిజైన్ చేశారు. ఫ్రంట్ డోర్, విండోలను పూర్తిగా అద్దాలతో ఏర్పాటు చేస్తున్నారు. లోపల, బయట ఖరీదైన వాల్ పెయింటింగ్ వేశారు. కిచెన్‌ను ఆకర్షణీయంగా టైల్స్ తో రూపకల్పన చేశారు. గచ్చు పై పూర్తిగా తెల్లటి పాలరాళ్లను ఏర్పాటు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సీలింగ్ కోటింగ్ ఇచ్చారు. ఒక్కో అన్న క్యాంటిన్లో ఆరు నుంచి ఎనిమిది ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరా, పదికి పైగా ట్యూబ్ లైట్లు అమరుస్తున్నారు. ప్రహరీకి, క్యాంటీన్ కు మధ్యన ఉన్న ప్రాంతంలో టైల్స్ వేస్తున్నారు. వీటిలో అందుబాటులో ఉంచాల్సిన ఆహార పదార్ధాల తయారీ బాధ్యతలను ప్రభుత్వం అక్షయపాత్ర సంస్థకు అప్పగించింది.