రాయలసీమ సీనియర్ నేత, మాజీ మంత్రి మైసూరారెడ్డి మళ్లీ టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. పలు విషయాలపై వీరు చర్చించారని సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే... టీడీపీలో మైసూరా చేరడం ఖాయమని చెబుతున్నారు. జులై మొదటి వారంలో ఆయన సైకిల్ ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ ప్రస్థానంలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీల్లో మైసూరా ఉన్నారు.
25 ఏళ్లపాటు కాంగ్రెస్ లో పనిచేసిన మైసూరా, జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ తో విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో 2004లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2004 ఎన్నికల్లో కడప పార్లమెంట్ కు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2006లో మైసూరారెడ్డిని రాజ్యసభకు పంపింది టీడీపీ. అయితే, జగన్ జైలుకు వెళ్లే రెండు రోజుల ముందు టీడీపీకి గుడ్ బై చెప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మైసూరారెడ్డి. జగన్ జైళ్లో ఉన్నసమయంలో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు.
కొంతకాలం తర్వాత పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని,జగన్ ఒంటెద్దుపోకడ తనకు నచ్చడం లేదంటూ వైసీపీకి గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం తటస్థంగా ఉంటున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజకీయంగా తిరిగి యాక్టివ్ అవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన పొలిటికల్ రీ ఎంట్రీ తిరిగి టీడీపీతోనే స్టార్ట్ అవుతుందని విశ్వసనీయవర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. తాజాగా మంత్రి సోమిరెడ్డితో భేటీకావడంతో మైసూరా మళ్లీ టీడీపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. జులై మొదటి వారంలో మైసూరా టీడీపీ తీర్థతం పుచ్చుకొంటారని తెలుస్తోంది.