ప్రపంచంలోని ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో ఒకటైన ‘ఫ్లెక్స్‌ట్రానిక్స్’ రాష్ట్రానికి రానుంది. రూ.585 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సుమారు 30 దేశాల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రాకతో రాష్ట్రంలోనూ 6,600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. సంస్థ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, సమాచార, సాంకేతిక(ఐటీ) మంత్రి లోకేశ్‌తో సమావేశం కానున్నారు. అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖతో రాష్ట్రంలో పెట్టుబడులపై ఒప్పందం చేసుకోనున్నారు. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ బెంగుళూరు, తిరుపతిలో ఇప్పటికే పలుసార్లు సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకున్న సానుకూలతలను వివరించారు.
అవసరమైన సమాచారాన్ని అధికారులు అందించేలా ఏర్పాట్లు చేశారు. కంపెనీ రాకతో ప్రపంచంలో మరిన్ని అగ్రగామి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు గత కొంతకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలు ఈ కంపెనీని తమ దగ్గర పెట్టాలంటూ పోటీకి వచ్చాయి. అయితే పలు దఫాలుగా లోకేశ్, ఒక దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడి రాష్ట్రానికి ఈ కంపెనీ వచ్చేలా ఒప్పించగలిగారు. తిరుపతి సమీపంలో ఈ కంపెనీ తన యూనిట్ నెలకొల్పనుంది.
ఫ్లెక్స్‌ట్రానిక్స్ 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రెండు లక్షల మందికి పైగా ఉద్యోగస్థులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫ్లెక్స్‌ట్రానిక్స్ రాష్ట్రానికి వస్తే...దానితో పాటు ఆ ఎలక్ర్టానిక్స్ కంపెనీకి విడిభాగాలను సరఫరా చేసే చిన్న చిన్న కంపెనీలు కూడా వచ్చేందుకు అవకాశాలున్నాయి. అయా కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ చేసిన ముమ్మర ప్రయత్నాల వల్ల ఇప్పటికే ఫాక్స్‌కాన్ రాష్ట్రానికి వచ్చింది. ఈ ఒక్క కంపెనీలోనే 14వేల మంది మహిళలకు ఉపాధి లభించింది. ఈ కంపెనీతో పాటు సెల్కాన్, కార్బన్, డిక్సన్ లాంటి కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయి. ఫలితంగా, విభజన నాటికి ఒక్క సెల్‌ఫోన్ కూడా తయారుకాని పరిస్థితి నుంచి...ఇప్పుడు దేశంలో తయారయ్యే ప్రతి 10సెల్ఫోన్లలో రెండు రాష్ట్రం నుంచే తయారయ్యే స్థాయికి రాష్ట్రం చేరుకొంది.