కాపు రిజర్వేషన్ ఉద్యమ సెగ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాకింది. మొన్నటి వరకు కాపు రిజర్వేషన్ పై చంద్రబాబు ప్రభుత్వం పై, విమర్శలు చేసిన జగన్, ఎప్పుడైతే చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి కాపులకి రిజర్వేషన్ ఇవ్వమని పంపించారో, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ పై అసలు మాట మాట్లాడటం లేదని కాపు జేఏసీ నాయకులు ఆందోళన చేసారు. కేంద్రం కోర్ట్ లో కాపు రిజర్వేషన్ ఉంది కాబట్టి, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ గురించి మాట్లడటం లేదని ఆందోళన చేసారు. గంటి పెదపూడిలో ప్రారంభమైన జగన్ ప్రజాసంకల్పయాత్రకు అడుగడుగునా కాపు నాయకులు, యువత ప్లకార్డులతో నిరసన తెలుపుతూ వైసీపీ కాపులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు.
గంటిపెదపూడి వద్ద జగన్ పాదయాత్రలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం జగన్ పాదయాత్ర ముందు రోడ్డుపై భైఠాయించగా జగన్ వ్యక్తిగత సిబ్బంది నిరసనకారులను పక్కకి నెట్టివేశారు. అనంతరం మధ్యాహ్నం వైవీపాలెం మీదుగా జగన్ పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో వైవీపాలెం సెంటర్లో మహిళలు, కాపు యువత ప్లకార్డులు ప్రదర్శించి స్పష్టమైన హామీ ఇవ్వాలని నినాదాలు చేశారు. అయితే మహిళలను కూడా జగన్ వ్యక్తిగత సిబ్బంది పక్కకు నెట్టివేసి యాత్రను కొనసాగించారు. జగన్ యాత్ర బోడపాటివారిపాలెం సెంటర్కు చేరుకునే సరికి అప్పటికే పెద్దసంఖ్యలో వేచియున్న కాపుయువత, నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు.
జగన్ పాదయాత్రను ఆపి వారిని ముందుకు రావాలని సూచించారు. వారు జగన్ వద్దకు వెళ్లి కాపు రిజర్వేషన్లపై వైసీపీ తరపున స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. తాడేపల్లిగూడెంలో మాట్లాడాను కదా అని జగన్ సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పుడు పి.గన్నవరం సెంటర్లో జరిగే బహిరంగ సభలో కాపు రిజర్వేషన్లు ప్రస్తావించాలని పట్టుబట్టారు. జగన్ వినతిపత్రాన్ని తీసుకుని పాదయాత్రను ముందుకు కొనసాగించారు. నిరసన కార్యక్రమాల్లో యర్రంశెట్టి సాయిబాబు, బోడపాటివారిపాలెం కాపునాయకులు, యువత పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాని చెప్తూ, జగన్ ప్రజలు తమ సమస్యలు తెలియజేసినా పట్టించుకోవటం లేదని, ఆగ్రహం వ్యక్తం చేసారు.