మాజీ ముఖ్యమంత్రి, జై సమైఖ్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయాల్లోకి రీ ఎంట్రీ చేయనున్నారు. అయితే ఆయాన ఎవరూ ఊహించని విధంగా,తిరిగి సొంతగూటికే చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రంగం సిద్ధమైంది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండడంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సిఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేకించారు. చివరి దాకా బంతి మన కోర్టులోనే ఉందని ఎపిలోని ప్రజలను నమ్మించారు.
అయితే విభజన తప్పదని తేలిపోవడంతో ఏకంగా సిఎం పదవికే రాజీనామా చేశారు. అప్పటికప్పుడే జై సమైఖ్యాంధ్ర పార్టీ పేరిట నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కొంతమేరకు ఉద్యమాన్ని నడిపారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు కావడంతో ఆయన అనూహ్యంగా తెరమరుగయ్యారు. అయితే ఇప్పటికే మాజీ సియంగా ఎంతో కొంత పేరు ఉంది. విభజన జరిగిన అనంతరం 4 ఏళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల జనసేన పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. తమ్ముడు తెలుగుదేశంలో చేరటంతో, తెలుగుదేశంలోకి వస్తారని అనుకున్నారు.
కానీ ఊహలను తారుమారు చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం నడిపిన ఏపి ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవివంచకుండా కాంగ్రెస్ తమను అన్యాయంగా విడగొట్టిందనే ఆగ్రహం, ఆవేశం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపిలో బలంగా ఉన్న తెలుగుదేశంతో పాటు, ప్రతిపక్షం కోసం పోటీ పడుతున్న,వైసిపి, జనసేన పార్టీలను తట్టుకుని వ్యతిరేకతను అనూకూలంగా మలుచుకుని ఓట్ల రూపంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, అక్కడ ప్రజలకు నమ్మకం కల్పించే నాయకుడు కావాలని కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపారు. ఇందులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ లో కి ఆహ్వానించినట్లు సమాచారం. దీనిపై ఆయన కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది.