సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందు కు టీడీపీ సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష వైకాపా ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యంలేకనే 2015లో ఎంపీల రాజీనామా ప్రకటించి మూడేళ్ల అనంతరం ఎన్నికలు రావని తెలిసి రాజీనామాలు చేసి ఇప్పటికి ఆమోదం పొందడంలో డ్రామా లాడుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. శుక్రవారం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్‌లో వర్చువల్ తనిఖీ అనంతరం సీఎం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. విపక్ష వైకాపా, బీజేపీ నేతల కుట్ర రాజకీయాలు, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి ఢిల్లిలో ఫిర్యాదులు, గవర్నర్ వ్యవస్థ, విపక్షనేత జగన్ ఆచరణకు నోచుకోలేని వాగ్ధానాలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
కుట్ర రాజకీయాలు ఎదుర్కోవడం టీడీపీకి కొత్త కాదని 1984లోనే కేంద్రం కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని బీజేపీ, వైకాపాల కుట్రలను అదేస్పూర్తితో అధిగమిస్తామని చంద్రబాబు అన్నారు. విపక్ష వైకాపా చెప్పే మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా వ్యవహ రిస్తోందన్నారు. హోదా అంశంపై పార్లమెంటులో ఓ వైపు అవిశ్వాస తీర్మానం పెట్టి, మరోవైపు ప్రధాని మోడీ వద్దకు వెళ్లి విశ్వాసం ప్రకటించడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తుంటే విపక్షం నోటికొచ్చి నట్లుగా మాట్లాడుతోందని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచరణకు సాధ్యంకాని హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రిగా పదేళ్లకుపైగా అనుభవం కలిగిన ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల బ్యాంకు ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని చెప్పిన హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ప్రధానికే సాధ్యంకానిది జగన్‌కు హామీలు నెరవేర్చడం సాధ్యమవు తుందా అని ప్రశ్నించారు. మోడీ కంటే జగన్ గొప్పవాడా అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంటే ఏమిటో తెలీదు, సెక్రటేరియట్ అంటే అసలే తెలీదు, ప్రభుత్వ పరిపాలన వ్యవస్థపై అవగాహన లేని జగన్ ఆచరణకు సాధ్యంకాని హామీలు కురిపిస్తున్నారని ఆరోపించారు. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తారంట అని వ్యంగోక్తి విసిరారు. ఈవెంట్ మేనేజ్ మెంట్‌తో జనాన్ని సభలకు తీసుకొచ్చినంత మాత్రానా రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని నిలదీశారు. కన్సల్టెంట్లు అంతా నాయకుల వుతారా పరొ క్షంగా వైకాపా రాజకీయ సలహాదారు పీకేపై సీఎం సెటైర్లు విసిరారు. ప్ర భుత్వం నడిపేందుకు సమర్ధవంతమైన నాయకత్వం కావాలన్నారు.