ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి, ప్రభుత్వం శుభ వార్త వినిపించింది. రాష్ట్రంలో వచ్చే నెల నుంచి ప్రతి రేషన్ కార్డుకూ రెండు కిలోల కందిపప్పును ఇవ్వనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. శుక్రవారం నిర్వహించిన గుంటూరు జిల్లా విజిలెన్సు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డులపై ఇచ్చే కందిపప్పు ధరను రూ.40 నుంచి రూ.35కు తగ్గించే ఆలోచన ఉందన్న ఆయన... తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. రేషన్ బియ్యంలో అక్రమాలను నిరోధించేందుకు అందరికీ నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. రేషన్ బియ్యంలో 20 శాతం రీసైక్లింగ్ అవుతోందని, వీటిని సాధారణ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినందున దీని నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.131 కోట్ల రాయితీని భరించనుంది. మార్క్ఫెడ్ ఇప్పటికే రైతుల నుంచి కొనుగోలు చేసిన 84వేల టన్నుల కందుల్లో 53 వేల టన్నులను పౌరసరఫరాల విభాగానికి అందిస్తారు. అదనంగా బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పును రూ.63.75 చొప్పున కొనుగోలు చేసి రాయితీపై కార్డుదారులకు పంపిణీ చేస్తారు. వేలిముద్రల పడక రేషన్ తీసుకోలేకపోతున్న వృద్ధులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులిస్తామన్నారు. 100 శాతం మంది రేషన్ తీసుకెళ్లేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. నిర్దేశించిన రోజుల్లో, సమయాల్లో రేషన్ దుకాణాలను తెరవాలని, లేకుంటే రోజుకు రూ.వెయ్యి, రెండో రోజుకు రూ.1500, మూడో రోజూ తెరవకుంటే రూ.రెండు వేలు జరిమానాతోపాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు వేరుగా నాణ్యమైన బియ్యం ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే పచ్చశనగపప్పు పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం అయ్యింది. పచ్చశనగపప్పును మార్చి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోటి 42 లక్షల తెల్లకార్డుదారులకు అందిస్తున్నారు. నాణ్యతలో లోపం వస్తే 1100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జూన్ 1 నుంచి రాష్ట్రంలో ఉన్న 27.666 రేషన్ డిపోల ద్వారా రంజాన్ తోఫా అందజేయనున్నారు. నాణ్యత లోపం లేకుండా ఉండేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసింది. సరుకులు పక్కదారి పట్టినా, నాణ్యత లోపించినా 1100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కార్డుదారుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని, సరకుల నాణ్యతాలోపంతో ఎవరూ నష్టపోకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.