ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంతో పాటు, విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం విశాలాంధ్ర మహాసభ ఉద్యమించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించింది. విజయవాడ ఆటోనగర్‌లో సమావేశమైన తర్వాత కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడికి విశాలాంధ్ర మహాసభ ప్రయత్నించింది. కేంద్రానికి నిరసన తెలియచెయ్యాలి అంటే, కేంద్ర కార్యలాయాలనే అడ్డుకోవాలని నిర్ణయించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. ఆదాయపన్ను, జీఎస్టీ, కస్టమ్స్ ఈ కార్యక్రమాలు నిర్వహించే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించామని, కార్యకలాపాలను అడ్డుకున్నామని నేతలు చెప్పారు.
ఐదు వందల మంది కార్యకర్తలు ఒక్కసారిగా ముట్టడికి యత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రభుత్వ కార్యాలయాల ద్వారాలను మూసివేసి ఆందోళనకారులను అతికష్టం మీద అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి సమీప పోలీసుస్టేషన్‌కు తరలించారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయడంలేదని, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమకు రూ. 40వేల కోట్లు రావాల్సి ఉందని వారన్నారు.
రూ. 16వేల లోటు బడ్జెట్ ఉంటే రూ. 4వేలు కోట్లు ఇచ్చి మోదీ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఏపీకి జాతీయ సంస్థల కోసం రూ. 12వేల కోట్లు ఖర్చు అయితే కేవలం రూ. 8 వందల కోట్లు ఇచ్చి... అన్ని ఇచ్చేశామని అమిత్ షా చెబుతున్నారని, పోలవరానికి, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని నేతలు మండిపడ్డారు. తెలుగు ప్రజలు పోరాడితే గానీ కేంద్రం దిగిరాదని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలను విశాలాంధ్ర మహా సభ అడ్డుకుంటుందని హెచ్చరించారు.