"మే 15 తరువాత మనకు చుక్కలు చూపిస్తాం అని, ఢిల్లీ బీజేపీ నాయకులు అంటున్నారు, మీరు చుక్కలు చూపిస్తే, మేము ఆ చుక్కలు చూస్తూ కూర్చుంటామా' అంటూ చంద్రబాబు బీజేపీ నేతల పై మాస్ పంచ్ వేసారు.. రాష్ట్ర హక్కుల కోసం తెలుగు జాతి అంతా ఏకమై తిరుగుబాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం గజగజ వణకాలని చంద్రబాబు అన్నారు. ‘‘మేం పోరాడుతోంది తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే భాజపా ఎంపీ కర్ణాటక ఎన్నికల తర్వాత చుక్కలు చూపిస్తామంటున్నారు. మేం ఎవ్వరికీ భయపడే సమస్యే లేదు. ప్రతిపక్ష పార్టీ అవినీతి కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం ముందు తాకట్టుపెట్టింది. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని విమర్శించాల్సిన ప్రతిపక్షనేత నాపై విమర్శలు చేస్తున్నారు’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో రూ.80 కోట్లతో 1.20 ఎకరాల్లో నిర్మించబోయే హజ్‌హౌస్ పనులకు సీఎం శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు.. ‘‘ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలను ప్రజలంతా అర్థం చేసుకోవాలి. కొంత మంది నాయకులు కేసుల మాఫీ కోసం కేంద్రంతో లాలూచీ పడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు’’ అని వైసీపీపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు విమర్శించారు. ‘‘ధర్మ పోరాటం నా కోసం కాదు. భావి తరాల కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, ఇందులో మతాలు, కులాలు, ప్రాంతాలు లేవు. వాటన్నింటికి అతీతంగా అందరం కలిసి పిల్లల భవిష్యత్ కోసం పోరాటం చేయాలి. ప్రజలకు న్యాయం చేయడానికి నేను అన్నివిధాలా ముందుకు వెళ్తున్నాను’’ అని ప్రకటించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని, మోదీని విమర్శించాల్సిన ఆయన (జగన్) తనను విమర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో నినదించి, టీడీపీ పోరాటానికి సహకరించాలని చంద్రబాబు కోరారు. కేంద్రంపై తాము చేస్తున్నది తెలుగు వారి ఆత్మగౌరవ పోరాటమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘విభజన సమయంలో అన్యాయం జరిగింది. మళ్లీ అన్యాయం చేయాలని కేంద్రం చూస్తోంది. రాష్ట్రంలో ఎవరికీ ఇబ్బంది కలుగకుండా పాలన చేస్తూనే, కేంద్రంతో రాజీలేని పోరాటం చేసి రాష్ట్ర హక్కులను సాధించుకుంటాం’’ అని ప్రకటించారు. అప్పటికీ స్పందించకపోతే వదిలి పెట్టే పరిస్థితి లేదని హెచ్చరించారు.