పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రం పై ఫైర్ అయ్యారు... ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా? అంటూ, అమరావతి నుంచి ఢిల్లీలో ఉన్న కేంద్రానికి కడిగి పడేసారు... మేమేమి గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని, చట్టంలో ఉన్న వాటినే అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అయినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక లోటుపై ఆయన స్పందిస్తూ కొంతమంది కావాలనే దాన్ని వివాదం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి రూ.16,700కోట్ల లోటుంటే రూ.4వేల కోట్లే ఇచ్చారని ఆయన అన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా రాష్ట్రానికి సరిగా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై అసెంబ్లీ స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్ ఎందుకు ఇవ్వడం లేదు? రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఊసే లేదు. కడపలో ఉక్కు కర్మాగారం హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదు అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు...
11 జాతీయ విద్యాసంస్థలకు నాలుగేళ్లలో రూ.400కోట్లే ఇచ్చారు. ఐదేళ్లయినా ఒక్కదానికీ సొంత భవనం లేదు. ప్రైవేటు వ్యక్తులకు భూములిస్తే ఆరునెలల్లో పనులు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి భూములిస్తే ఇంతవరకు ప్రారంభం కాలేదు. కృష్ణపట్నం పోర్టు వల్ల వచ్చే ఆదాయం ఇంకా తెలంగాణకే పోతోంది. విజయవాడ, విశాఖ మెట్రో రైలు సాధ్యం కాదన్నారు. రూ.40 వేల కోట్ల భూములను రైతులు రాజధానికి ఇచ్చారు. రాజధానికి రూ.1500 కోట్లు ఎలా సరిపోతాయి? ఏపీకి రాజధాని నగరం అవసరం లేదా? సహాయం చేయకపోగా విమర్శించడం, వెక్కించడం సబబా? హైదరాబాద్‌లో ఎన్నో పరిశోధనా సంస్థలు ఉన్నాయి. ఏపీకి ఉదారంగా కేంద్ర సంస్థలు ఎందుకివ్వరు? ఏపీ భారతదేశంలో భాగం కాదా? అంటూ కేంద్రాన్ని నిలదీశారు...