వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డికి, తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీ వేదికగా సవాల్ విసిరారు. విజసాయి రెడ్డి, నేను రాజీనామాకు సిద్ధం, వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా, నాతొ పాటు వచ్చి తన పదవికి రాజీనామా చెయ్యి... ఇద్దరం ప్రజల్లోకి వెళ్దాం, ఎవరు ఏంటో ప్రజలే చెప్తారు అంటూ, జేసీ దివాకర్ రెడ్డి, విజసాయి రెడ్డికి సవాల్ విసిరారు... ఊరికే రాజీనామాలు అంటూ మీడియాలో హడావిడి కాదు, జైట్లీ స్పష్టం చెయ్యగానే మా మంత్రులు రాజీనామా చేసారు, వీరు మాత్రం ఏప్రిల్ 6 దాకా ఆగుతారంట, అంటూ ఎద్దేవా చేసారు...
ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విజయసాయికి చిత్తశుద్ధి, రాష్ట్రంపై ప్రేమ ఉంటే వెంటనే రాజీనామాకు కలిసిరావాలని అన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య ట్రిపుల్ తలాక్ అయిపోయిందని, వారి పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించాలని అన్నారు. తాము వదిలేసిన బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖాకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన థర్డ్ ఫ్రంట్ వెనుక చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదని, చంద్రబాబు వెనుకే అందరూ రావాల్సి వుంటుందని అన్నారు.
మరో పక్క, టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజుకో విధంగా వేషం వేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. మొదటి కృష్ణుడిగా, ఆపై ఎన్టీఆర్ వేషధారణలో మొన్న రైతులా వచ్చిన ఎంపీ నేడు కోయదొర వేషంలో పార్లమెంటుకు వచ్చారు. పార్లమెంటు ఆవరణలో కుర్రోకుర్రు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘చెప్పినవాట వింటే హుర్రో హుర్రు...వినకపోతే పుర్రోపుర్రు. ఇందిరాగాంధీకి చెప్పినా...ఎన్టీఆర్తో పెట్టుకోవద్దని. నా మాట వినలేదు. దాంతో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సోనియాతో చెప్పినా... తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని...నా మాట వినకుండా విభజన చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ఎన్ని కష్టాలు పడుతుందో అందరికి తెలుసు. మోదీ...సఖ్యంగా ఉండేది ఇష్టాం లేదా?...మీకు మూడిందా ఏంది? తెలుగు ప్రజల ఆత్మగౌరవ నాడి తెలియలేదా ఏంది? ఇలానే ఉంటే మీ పని పుర్రోపుర్రు. దీని అర్థం ఆంగ్లంలో ‘అవుట్’ అని కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు చేశారు.