గత రాత్రి మొత్తం టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ కు సంబంధించి, హైడ్రామా నడిచింది. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో, ఒక పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో, విజయవాడ పటమటలంకలో, సిఐడి పోలీసులు , అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబుని 11 గంటలకు అదుపులోకి తీసుకుని, 12.30 గంటలకు అరెస్ట్ చేసామని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. 12.30 గంటలకు అరెస్ట్ చేసినట్టు, సిఐడి పోలీసులు అధికారికంగా దృవీకరించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఐపిసిలోని 477(A),466,467,468,471,465,420, Rw34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అశోక్ బాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా పని చేయక ముందు, ఏపి ఎన్జీవో అధ్యక్షుడిగా పని చేసారు. ఆయన ఏపి ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వంలోని కమర్షియల్ టాక్స్ విభాగంలో పని చేసారు. ఆ సమయంలో పదోన్నతి కోసం, బీకాం డిగ్రీ ఉన్నట్టుగా పేర్కొన్నారని, సర్వీస్ రికార్డులు ట్యాంపర్ చేసారని, ఆయన పైన అభియోగాలు నమోదు అయ్యాయి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇదే అభియోగాలు రాగా, అప్పట్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ జరిపింది.
ఆయన రికార్డులు ఏమి ట్యాంపర్ చేయలేదని, ఆయన డి.కాం అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అని చెప్తే, రికార్డు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ టైపింగ్ లో తప్పు చేసి, బి.కాం అని టైపు చేసారని, అప్పట్లో విజిలెన్స్ విభాగం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన పై కేసు పెట్టటంతో, అశోక్ బాబు పది రోజుల క్రిందటే ఈ కేసు పై స్పందించారు. ఒక ఉద్యోగ సంఘ నాయకుడి పేరు చెప్పి, అతని ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పారు. ఆ ఉద్యోగ సంఘ నేత వెనుక ప్రభుత్వం ఉందని, ఆరోపణలు చేసారు. దీని పైన లోకాయుక్తాకు ఫిర్యాదు చేసారు. అయితే లోకాయుక్తాకు ఫిర్యాదు చేస్తే, వారు ఎంక్వయిరీ చేయకుండా, సిఐడి విభాగానికి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేసారు. సిఐడి దీని పైన కేసు నమోదు చేసారు. అయితే ఇలాంటి చిన్న కేసు విషయంలో, కనీసం ప్రాధమిక ఎంక్వయిరీ కూడా చేయకుండా, గతంలోనే ముగిసిపోయిన అంశాన్ని, ఇప్పుడు పైకి తెచ్చి, ఏదో పెద్ద నేరం లాగా, అర్ధరాత్రి హైడ్రామా మధ్య అరెస్ట్ చేసారు. ప్రస్తుతం అశోక్ బాబు సిఐడి కార్యాలయంలో ఉన్నారు.