అమరావతిలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు, చంద్రబాబు టెక్నాలజీ విప్లవం అంటే ఏంటో చూపించనున్నారు... ఆసియాలోనే అతి పెద్దదైన 66 అడుగుల పొడవైన వీడియో తెరపై.. దానిపై ఒకేసారి రాష్ట్రంలోని వందల ఊళ్లలోని సర్వెలైన్సు కెమెరాల నుంచి అక్కడ తాజా స్థితి ప్రత్యక్ష పసారం, మరోవైపు పరిష్కార వేదికద్వారా వందల మంది సిబ్బంది లక్షల్లో వస్తున్నా ప్రజా ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు ప్రత్యక్షప్రదర్శన... ఇంకో వైపు పీపుల్స్ హబ్... ఈ ప్రతిగతి, తాళం వేసి ఉన్న ఇళ్లకు గస్త్రీకాస్తున్న పోలీసు కెమెరా కళ్లు... వాతావరణ ప్రత్యక్ష స్థితి... ఒకటా, రెండా. దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ ముందు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక వినియోగంలో తనకున్న అపార అనుభవపాఠ సోయగాన్ని ప్రదర్శించనుంది.
ఇందుకోసం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. దేశంలో మరే ఇతర రాష్ట్రం చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేస్తోంది. ఇందు కోసం అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కేంద్రాన్నిబుధవారం ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ముందు రాష్ట్రప్రభుత్వం సుపరిపాలన కోసం అనుసరిస్తున్న సాంకేతిక పద్దతులను ఆయన ముందు ప్రదర్శించబోతోంది. రాష్ట్రపతి దాదాపు ఇక్కడ అరగంట పాటు గడపడానికి సమయం కేటాయించారంటే దాని ప్రాముఖ్యత ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం తన సాంకేతిక నైపుణ్యతలను ఆయన ముందు ఒక సాంకేతిక ఇంద్రధనస్సు తరహాలో ఒకదాని తరువాత ఒకటి వెనువెంటనే తెర పై ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకోసం ప్రతి చిన్న ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు,సూచనలు, సలహాలు మేరకు ఆర్టీజీఎస్ సీఈవో బాబు, ఈ బృందం రేయింబవళ్లు శ్రమిస్తుంది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్ర కార్యాలయంలో తొలుత రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన పరంగా అనుసరిస్తున్న పలు సాంకేతిక నైపుణ్యాలు వాటి ద్వారా సాధిస్తున్న ఫలితాలు ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఆధునీకరించిన 2.0 వెర్షన్ కోర్ డ్యాష్ బోర్డును రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి) ద్వారా రాష్ట్రంలో 20 వేల సర్వెలెన్సు కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే 8 వేల కెమెరాలను ఏర్పాటు చేసింది. చిట్టచివరిగా రాష్ట్రపతి కోవింద్ ఒకేసారి వేల మంది ప్రజలతో రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి ముఖాముఖిగా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కొన్ని మారుమూల ప్రాంతాలకు చెందిన పంచాయితీలను దీనికోసం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రామ్‌నాధ్ కోవింద్ కొంత మంది ప్రజలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించనున్నారు.